- 16 సెషన్లలోనే రూ.83 వేల కోట్ల కొనుగోళ్లు
- టెలికం, ఐటీ షేర్లలో కొనుగోళ్లు..ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో అమ్మకాలు
- 14 శాతం వరకు ర్యాలీ చేసిన రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు
- వారం రోజుల్లో 7.5 శాతం పెరిగిన నిఫ్టీ
ముంబై: భారత స్టాక్ మార్కెట్లలోకి ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు/ ఎఫ్ఐఐలు) గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాదిలో అక్టోబర్ వరకు నికరంగా రూ.3.32 లక్షల కోట్ల (35 బిలియన్ డాలర్ల) విలువైన షేర్లను అమ్మిన వీరు, తాజాగా పెద్ద మొత్తంలో షేర్లను కొనడం మొదలుపెట్టారు. గత 16 సెషన్లలోనే దాదాపు రూ.83,600 వేల కోట్ల (8.8 బిలియన్ డాలర్ల) నిధులను కుమ్మరించారు. బుధవారం ఒక్క సెషన్లోనే ఎఫ్ఐఐలు నికరంగా రూ.12,500 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. ఈ నెల తొలి ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే ఏకంగా రూ.53,739 కోట్ల మేర నిధులను దేశీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. 2026 ప్రారంభం నుంచి చూస్తే మొదటి పది నెలల్లో ఎనిమిది నెలలు నికర అమ్మకందారులుగా ఉంటూ వచ్చిన విదేశీ ఇన్వెస్టర్లు.. ఇప్పుడు ఒక్కసారిగా దూకుడు పెంచడంతో సెన్సెక్స్, నిఫ్టీ ర్యాలీ చేస్తున్నాయి.
గ్లోబల్ మార్కెట్లలో ఏఐ కరెక్షన్
ఎఫ్ఐఐలు యూటర్న్ తీసుకోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఏఐ సంబంధిత షేర్లు పడుతుండడమేనని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల స్టాక్ మార్కెట్లలో ఏఐ ఆధారిత టెక్నాలజీ షేర్ల భారీ ర్యాలీ తర్వాత డేటా సెంటర్ల ఖర్చులు, భవిష్యత్ రాబడులపై ఆందోళనలు తలెత్తాయి. దాంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు అక్కడ లాభాలు బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రపంచ పోర్ట్‌ఫోలియోల్లో 'నాన్- ఏఐ ట్రేడ్'గా గుర్తింపు పొందిన భారత మార్కెట్ వైపు విదేశీ ఫండ్లు తమ పెట్టుబడులను మళ్లించాయి.
జియోజిత్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ.. విదేశీ ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్ల కారణంగా దేశీయ మార్కెట్లో షార్ట్ కవరింగ్ జరిగి, నిఫ్టీ కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 7.5శాతం పైగా పరుగులు తీసిందన్నారు. కాగా, నిఫ్టీ బుధవారం 210 పాయింట్లు (0.84 శాతం) లాభపడి 25,255 వద్ద, సెన్సెక్స్ 772 పాయింట్లు ఎగిసి 81,879 వద్ద ముగిశాయి.
జియో, ఐటీ కంపెనీలపై ఆసక్తి
ఈ ఏడాది అక్టోబర్ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం మీద 2.2 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్ల) నిధులను వెనక్కి తీసుకున్నప్పటికీ, టెక్నాలజీ రంగంలో 1.4 బిలియన్ డాలర్లు (రూ.13,300 కోట్లు), టెలికం విభాగంలో 700 మిలియన్ డాలర్ల (రూ.6,650 కోట్ల) చొప్పున పెట్టుబడులు పెట్టడం విశేషం. టెలికం రంగంలో జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ విదేశీ ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకోగా, గ్లోబల్‌గా ఏఐ షేర్లు పడుతుండడంతో ప్రత్యామ్నాయంగా సేఫ్టీ కోసం దేశీయ ఐటీ సర్వీసెస్ షేర్లను విదేశీ ఫండ్లు ఎంచుకుంటున్నాయి.
ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లయిన ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లయితే గత 15 సెషన్లలో 10–14 శాతం వరకు ర్యాలీ చేశాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ నుంచి 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,500 కోట్లు), బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,500 కోట్లు) , ఆటో రంగం నుంచి 800 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.7,600 కోట్ల) నిధులను విదేశీ సంస్థలు వెనక్కి తీసుకున్నాయి. దీనినిబట్టి ఈ తాజా కొనుగోళ్లు మార్కెట్ మొత్తం కాకుండా నిర్దిష్ట రంగాలకే పరిమితమై ఉన్నాయని తెలుస్తోంది.
ఎల్టీసీజీ తగ్గుతుందనే ఆశ
కేంద్ర బడ్జెట్ 2027లో విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను రాయితీలు ఇస్తారనే అంచనాలతో వీరి కొనుగోళ్లు పెరిగాయని ట్యాక్స్ సర్వీసులు అందించే బీడీఓ ఇండియా నిపుణుడు మనోజ్ పురోహిత్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5శాతం లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) పన్నును విదేశీ ఇన్వెస్టర్లపై పూర్తిగా ఎత్తివేయాలని, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) రేట్లను తగ్గించాలని సెబీతో పాటు పరిశ్రమ వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ నుంచి సానుకూల సంకేతాలు వస్తుండటంతో విదేశీ సంస్థలు తమ అమ్మకాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నాయి.
