హైదరాబాద్, వెలుగు: సోనియా గాంధీ ఆత్మకథను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తప్పకుండా చదవాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ పుస్తకంపై వస్తున్న రాజకీయ విమర్శలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్లోని ప్రకాశం హాల్లో నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో జన్మించినప్పటికీ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించిన ఆదర్శ మహిళ సోనియా గాంధీ అని కొనియాడారు. 2004లో ప్రధాని పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకురాలని, డాక్టర్ మన్మోహన్ సింగ్ను ప్రధానిగా ఎంపిక చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ఆమె ముందుచూపుతో వ్యవహరించారని గుర్తుచేశారు. మరోవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.
