గల్లీల కారు.. ఢిల్లీల కమలం.. బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ ఫైర్

గల్లీల కారు.. ఢిల్లీల కమలం.. బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ ఫైర్
  •  తెలంగాణలో మైనారిటీలతో కబుర్లు
  • పార్లమెంట్‌‌‌‌లో బీజేపీ బిల్లులకు మద్దతు
  • 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకోం
  • దమ్ముంటే గుజరాత్‌‌‌‌లో రద్దు చేయాలని సవాల్
  • ఏఐతో సాఫ్ట్‌‌‌‌వేర్ కొలువులు పోయినా 
  • బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఢోకా లేదు 
  • జాతీయ విద్యా దినోత్సవ సదస్సులో సీఎం
  •  బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ ఫైర్

హైదరాబాద్, వెలుగు:  పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు గల్లీల్లో మైనార్టీల ఓట్లు అడుగుతూ.. ఢిల్లీలో ప్రధాని మోదీ ముందు సాగిలపడుతున్నారని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శించారు. "ఇక్కడ కారు గుర్తుతో బయలుదేరి.. ఢిల్లీలో మోదీ గల్లీకి వెళ్లగానే కమలంగా మారిపోతారు. రంజాన్ రోజుల్లో షేర్వానీలు వేసుకుని బిర్యానీలు తింటూ కబుర్లు చెప్పే నేతలు పార్లమెంటులో మాత్రం బీజేపీ బిల్లులకు మద్దతిచ్చారు" అని ఎద్దేవా చేశారు. గతంలో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మైనార్టీలను నమ్మించి మోసం చేసి పారిపోయారని ఆరోపించారు. 

హైదరాబాద్ బంజారా భవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలతో కలిసి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్​ మాట్లాడుతూ..   మైనార్టీల సంక్షేమం కోసం గతంలో సోనియా గాంధీ,  దివంగత వైఎస్సార్ చొరవతో సచార్ కమిటీ సిఫార్సుల మేరకు 4 శాతం రిజర్వేషన్లు అమలులోకి తెచ్చామని సీఎం గుర్తుచేశారు. ఈ రిజర్వేషన్ల ఫలితంగానే వేలాది మంది మైనార్టీ బిడ్డలు గ్రూప్-1, గ్రూప్-2 అధికారులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడ్డారని వివరించారు

. "చేవెళ్ల గడ్డపైకి వచ్చి మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీరాలు పలుకుతున్నారు.. నిజంగా దమ్ముంటే, ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌‌‌‌‌‌‌‌లో అమలవుతున్న మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసి చూపించాలి" అని సవాల్ విసిరారు. దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనార్టీలను, 40 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలను విస్మరించి దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని, బీజేపీ పేదల ఓటు హక్కును, విద్యను హరించే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

ఓల్డ్​ సిటీ కాదు.. ఒరిజినల్​ సిటీ.. 

హైదరాబాద్ నగరాన్ని పాతబస్తీగా పిలవడం తనకు ఇష్టం లేదని, ‘అది ఓల్డ్​ సిటీ కాదు..  ఒరిజినల్ సిటీ’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  మూసీ నది పునరుజ్జీవనం ద్వారా పాతబస్తీ రూపురేఖలు మారబోతున్నాయని రేవంత్ వెల్లడించారు. పాతబస్తీ వ్యాపార సంస్కృతిని కాపాడుతూ మూసీ పరీవాహక ప్రాంతంలో పూర్తిస్థాయి ‘నైట్ ఎకానమీ’ని ప్రోత్సహిస్తామని, యువత రాత్రిపూట కూడా గౌరవప్రదంగా వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందేలా వెసులుబాటు కల్పిస్తామన్నారు.  మైనార్టీ విద్యార్థుల ప్రీ-మెట్రిక్ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లను కేంద్రం రద్దు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యానిధి, ట్రిమ్రీస్ పాఠశాలల ద్వారా ఆదుకుంటోందని చెప్పారు.  

భవిష్యత్​ బ్లూ కాలర్​ జాబ్​లదే..

ఉన్నత సాంకేతిక విద్య కోసం ఐఐటీ ఖరగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీలను, ఇంజనీరింగ్ కాలేజీలను ఆజాద్ ఆలోచనా విధానంతోనే నెలకొల్పారని సీఎం చెప్పారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో నెలకొల్పిన విద్యా సంస్థల ఫలితంగానే నేడు మన యువత ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థల్లో రాణిస్తున్నారన్నారు.  ఏఐ ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని, భవిష్యత్తు అంతా స్కిల్డ్ బ్లూ కాలర్ జాబ్స్‌‌‌‌‌‌‌‌దేనని తెలిపారు. 

అందుకే తెలంగాణలో 65 ఐటీఐలను ఏటీసీలుగా చేస్తున్నామని ప్రకటించారు. దీనికితోడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్స్, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సమగ్ర రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రవేశపెట్టి యువతను గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.