కోడేరు: డీ8 కాలువను వెడల్పు చేస్తం : మంత్రి జూపల్లి కృష్ణారావు

కోడేరు: డీ8 కాలువను వెడల్పు చేస్తం :  మంత్రి జూపల్లి కృష్ణారావు

కోడేరు,(పెద్దకొత్తపల్లి), వెలుగు : డీ8 కాలువను వెడల్పు చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లి, నాగులపల్లి తండా, రేకులపల్లి తండా గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.  డీ8 కాలువను వెడల్పు చేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు రేకులపల్లి నుంచి రాజాపూర్, ఏదుల వరకు రోడ్డు మంజూరు చేసినప్పటికీ, గత పాలకులు దానిని వినియోగించుకోలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం అదే మార్గంలో రేకులపల్లి తండా నుంచి రాజాపూర్, ఏదుల వరకు రూ.3 కోట్లు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. 

ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల సాయంతోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని, పెద్ద ఇండ్లు కట్టుకుని అప్పుల పాలు కావొద్దని లబ్ధిదారులకు సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని, ఉపాధి హామీ పథకం కింద 15 రోజుల్లో గ్రామపంచాయతీ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రేకులపల్లి సర్పంచ్ ప్రభాకర్ నాయక్ మాట్లాడుతూ డిడీ8 కాలువ కింద 1000 ఎకరాలకు గాను ప్రస్తుతం కేవలం 200 ఎకరాలకే సాగునీరు అందుతోందని, మిగతా 800 ఎకరాలతో పాటు వావిళ్ల కుంట, రాజన్న కుంట, కల్యాణ కుంటలకు సాగునీరు అందించాలని మంత్రిని కోరారు.  కార్యక్రమంలో కోడేరు మండలం మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు, కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లేని వేణుగోపాల్ రావు, ఏదుల మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి తదితర నాయకులు పాల్గొన్నారు.