- కామారెడ్డి హామీలు-దగాపడ్డ బీసీలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీసీ మేధావులు, నేతలు డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కామారెడ్డి హామీలు– దగాపడ్డ బీసీలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
దీనికి అధ్యక్షత వహించిన రిటైర్డ్ ఐఏఎస్, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీల సంక్షేమం కోసం మూడేండ్లలో రూ.60 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. ప్రభుత్వం కేవలం రూ.33 వేల కోట్లు కేటాయించిందని, అందులోనూ సుమారు రూ.6 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన 21 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. ఆలిండియా బహుజన్ సమాజ్ పార్టీ కన్వీనర్, మాజీ డీజీపీ పూర్ణచందర్ రావు మాట్లాడుతూ.. బీసీలు తమ హక్కుల కోసం ఉద్యమాలు చేయడమే కాకుండా, ఎన్నికల్లోనూ పెద్ద సంఖ్యలో పోటీ చేయాలన్నారు.
రాబోయే కాలంలో ఒక బలమైన బీసీ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి, దాని ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు, ప్రదర్శనలు నిర్వహించి బీసీల రాజకీయ చైతన్యాన్ని బలోపేతం చేయాలని సూచించారు. మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీలందరూ కులాలకతీతంగా ఐక్యమై తమ హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని రంగాల్లో బీసీలు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
