- విద్యతో పాటు తల్లిదండ్రులతో అనుబంధాన్ని కొనసాగిస్తాం
- స్టూడెంట్లకు వారానికి ఆరురోజులు పౌష్టికాహారం అందిస్తాం
- పిల్లలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్, యూనిఫాం, షూస్, బ్యాగ్, పుస్తకాలు, నోట్‍బుక్స్
- ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వరంగల్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తామని, విద్యతో పాటు తల్లిదండ్రులతో వారి అనుబంధాన్ని కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం గ్రేటర్ వరంగల్లో ఆయన పర్యటించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డితో కలిసి కాజీపేట ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రాంగణంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‍కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న తెలంగాణ యంగ్ ఇండియా స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో ఒకేసారి 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు అనుమతులు మంజూరు చేశామని, ఒక్కోదానిని రూ.200 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నామని చెప్పారు. రాబోయే విద్యాసంవత్సరం నాటికి చాలాచోట్ల వీటిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను సైతం నియోజకవర్గానికి ఒకటి నిర్మిస్తామని, సెమీడెన్షియల్ విధానంలో నిర్వహించే వీటిలోని విద్యార్థులకు వారానికి ఆరురోజుల పాటు బ్రేక్‍ఫాస్ట్, లంచ్ అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 27 లక్షల మంది స్టూడెంట్లకు ఉదయం అల్పాహరం పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాల ముగిశాక పిల్లలు తమ ఇండ్లకు వెళ్లేలా ప్రభుత్వం తరఫునే రవాణా సౌకర్యం సైతం ఉచితంగానే అందిస్తామన్నారు. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ విద్యాబోధనకుతోడు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాం, షూస్, పుస్తకాలు, నోట్‍బుక్స్, స్కూల్ బ్యాగులు అందించనున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు బాలసముద్రం, కేయూసీ పరిధిలో రెండు నూతన 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నాయిని కోరారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కుడా చైర్‍పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్‍పాయ్, టీజీఎన్‍పీడీసీఎల్ సీఎండీ వరుణ్‍రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
