ఓటుకు డబ్బులు తీసుకోవద్దు.. గ్రాడ్యుయేట్లే అలా చేస్తే అవినీతి మరింత పెరుగుతది : టీఆర్ఎస్ చీఫ్ కవిత

ఓటుకు డబ్బులు తీసుకోవద్దు.. గ్రాడ్యుయేట్లే అలా చేస్తే అవినీతి మరింత పెరుగుతది : టీఆర్ఎస్ చీఫ్ కవిత
  • ఆ అపవాదును పట్టభద్రులు తొలగించుకోవాలె
  • రూ.200 కోట్లు ఖర్చు పెట్టయినా గెలుస్తమంటున్రు
  • ఇప్పుడు మండలిలో ప్రతిపక్షమే లేకుండా పోయింది
  • మా అభ్యర్థులను గెలిపిస్తే గొంతెత్తుతం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు కూడా డబ్బులు తీసుకుని ఓటు వేస్తారన్న అపవాదు ఉందని, ఆ ఉద్దేశంతోనే రూ.200 కోట్లు ఖర్చు పెట్టయినా సరే తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని సీఎం రేవంత్​ అంటున్నారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్​ఎస్​) చీఫ్​కవిత అన్నారు. డబ్బులు తీసుకుని ఓటేస్తారనే అపవాదును గ్రాడ్యుయేట్లు తొలగించుకోవాల్సిన అవసరముందన్నారు. గ్రాడ్యుయేట్లే డబ్బులు తీసుకుని ఓటు వేస్తే వ్యవస్థలో అవినీతి మరింత పెరుగుతుందన్నారు. తన మాటలు కఠినంగా ఉన్నా సరే గ్రాడ్యుయేట్లు తమపై ఉన్న అపవాదును తొలగించుకోవాలని సూచించారు. 

బుధవారం పార్టీ ఆఫీసులో గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 80 లక్షల మంది ఏదో ఒక డిగ్రీ ఉన్న వాళ్లేనని, వారంతా కూడా ఆలోచించి ఓటు వేయాలన్నారు. మండలిలో ప్రతిపక్షం అవసరం శాసన మండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం లేని పరిస్థితి నెలకొందని, బీఆర్ఎస్ సభ్యులు సగానికి పైగా కాంగ్రెస్ లో చేరిపోయారని కవిత గుర్తు చేశారు. బీజేపీ సభ్యులు కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని విమర్శించారు. ప్రజల కోసం గొంతెత్తే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతిపక్షంగా గ్రాడ్యుయేట్ల తరపున పోరాటం చేస్తామన్నారు. 

ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు, నిద్రావస్థలో ఉన్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను విద్యావంతులు అవకాశంగా మలుచుకోవాలని కోరారు. తమ పార్టీ అభ్యర్థులు చదువుకున్న యువకులని, ఒకరు ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కాగా మరొకరు కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఉద్యమకారులని చెప్పారు. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తెలంగాణలోని మూడో వంతు ప్రాంతంలో ఎన్నికల వాతావారణం ఉందని చెప్పారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచార వాహనాలను ఆమె ఈ సందర్భంగా జెండా ఊపి ప్రారంభించారు.