బ్యాంకు ఖాతా లేకున్నా.. డబ్బు పంపొచ్చు.. ఆర్బీఐ కొత్త రూల్స్ 

బ్యాంకు ఖాతా లేకున్నా.. డబ్బు పంపొచ్చు.. ఆర్బీఐ కొత్త రూల్స్ 
  • వాక్‌ ఇన్‌ కస్టమర్లకు  రూ.50 వేల పరిమితి
  • మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్​బీఐ  

ముంబై : నగదు బదిలీలకు సంబంధించి ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాంకు ఖాతా లేని వాక్‌ ఇన్‌ కస్టమర్లు బ్యాంకు నుంచి నెఫ్ట్‌ విధానంలో లబ్ధిదారుడి ఖాతాకు గరిష్టంగా రూ.50 వేలు పంపించవచ్చు. ఈ నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. బిజినెస్‌ కరస్పాండెంట్లు (బీసీలు), ఏటీఎంల ద్వారా ఒక్కో లావాదేవీలో  రూ.5,000 వరకు బదిలీ చేసేందుకు బ్యాంకులు అనుమతించవచ్చు. ఒక వ్యక్తి నెలకు ఈ మార్గంలో రూ.25 వేల వరకు పంపించవచ్చు. 

బ్యాంకు ఖాతా ఉన్నవారు తమ ఖాతా నుంచి నగదు బదిలీ చేసి, ఖాతా లేని వ్యక్తులకు ఏటీఎం లేదా ఏజెంట్ల ద్వారా నగదు అందుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఈ విధానంలో ఒక్కో లావాదేవీకి రూ.10 వేలు, ఒక్కో లబ్ధిదారుడికి నెలకు రూ.25 వేల పరిమితి విధించారు.మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థలు, హెచ్చరికలు ఏర్పాటు చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐ సూచించింది.