- ఇచ్చోడ మండలం జుమ్నీ ఎక్స్‌రోడ్డు వద్ద ఘటన
నేరడిగొండ, వెలుగు: కుటుంబ కలహాలతో ఓ మహిళ రన్నింగ్ బస్సులో నుంచి దూకి సూసైడ్ చేసుకున్న ఘటన ఆదిలాబాద్జిల్లా ఇచ్చోడ మండలం జుమ్నీ ఎక్స్‌రోడ్డు సమీపంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్తి (30) కుటుంబంలో కొంతకాలంగా కలహాలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె మహారాష్ట్రలోని పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం తన తల్లి, అక్క, ముగ్గురు పిల్లలతో కలిసి నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది.
బస్సు ఇచ్చోడ మండలం జుమ్నీ ఎక్స్‌రోడ్ సమీపానికి చేరుకోగానే ఆర్తి ఒక్కసారిగా బస్సు డోర్ వద్దకు వెళ్లి కిందకు దూకింది. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి పడటంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు ఉలిక్కిపడగా, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఆర్తికి సీపీఆర్ చేస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్ల ముందే తల్లి మృతి చెందడంతో ముగ్గురు పిల్లల రోదనలు అక్కడివారిని కలచివేశాయి.
