వీసా రూల్స్ మార్చిన కేంద్రం..టూరిస్టులకు మరింత సులభతరం చేయడమే లక్ష్యం

వీసా రూల్స్ మార్చిన కేంద్రం..టూరిస్టులకు మరింత సులభతరం చేయడమే లక్ష్యం

న్యూఢిల్లీ: విదేశీయులకు భారత సందర్శన మరింత సులభతరం చేసేందుకు వీసా నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధాన వీసా కేటగిరీల సంఖ్యను 13 నుంచి 9కి, ఉప-కేటగిరీలను 49 నుంచి 23కి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, విదేశీ పర్యాటకులు, వైద్యం కోసం వచ్చేవారు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంస్కరణలు తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ కేటగిరీల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించి, స్పష్టమైన ప్రత్యామ్నాయాలను అందించడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. 

ఇకపై విజిటర్స్ వీసా..

ఈ విధానంలో భాగంగా వీసా దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. అన్ని ఉప-కేటగిరీలలోనూ వీసా దరఖాస్తు ఫారమ్‌‌‌‌‌‌‌‌లలో పూరించాల్సిన సమాచారాన్ని ఏకంగా 65 నుంచి 70% వరకు తగ్గించినట్లు కేంద్ర హోం శాఖ పేర్కొంది. దీనివల్ల దరఖాస్తుదారులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రక్రియ ఈజీ అవుతుంది. గతంలో ఉన్న ‘టూరిస్ట్ వీసా’ పేరును ‘విజిటర్ వీసా’గా మార్చారు.

వైద్య, విద్య, వ్యాపార వీసాలకు సంబంధించిన నిబంధనలను కూడా మరింత సరళతరం చేస్తూ పునర్వ్యవస్థీకరించారు. ఈ కొత్త నిబంధనలను సజావుగా అమలు చేసేందుకు వీలుగా హోంశాఖ తన ఐటీ వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేస్తోంది. ఈ సరికొత్త ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్ ద్వారా వీసాల జారీ ప్రక్రియ త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు.v