- అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక సమస్యలూ మాయం
- ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ కీలక వ్యాఖ్యలు
- వేల ఏండ్ల రోగాలు నయమయ్యే అద్భుత యుగం వస్తది
- వందేండ్ల పరిశోధనలకు పదేండ్లలోనే పరిష్కారం
- ఏకీభవించిన మస్క్, డీప్‌మైండ్ సీఈవో హస్సాబిస్
- కొట్టిపారేసిన ఫార్మా సీఈవోలు, వైద్య నిపుణులు
- ఫార్ములా కనిపెడితే సరిపోదు.. ట్రయల్స్‌కు 10–12 ఏండ్లు
- అనవసర అంచనాలు పెంచొద్దని వార్నింగ్
న్యూఢిల్లీ: వైద్య రంగం గురించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వచ్చే పదేండ్లలోపే క్యాన్సర్, అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి), గుండె జబ్బులు, మానసిక సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధులు పూర్తిగా కనుమరుగవుతాయని వెల్లడించారు. ఈ రోగాలు భవిష్యత్తులో కేవలం గతానికి సంబంధించిన జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయని తెలిపారు. ఆంథ్రోపిక్ సంస్థ అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా విడుదల చేసిన 42 నిమిషాల ఐపీఓ రోడ్‌షో వీడియోలో డారియో అమోడెయ్ మాట్లాడారు. ఏఐని మనం సరిగ్గా, బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే వేల ఏండ్లుగా మనిషిని వేధిస్తున్న రోగాలను నయం చేసే ఒక అద్భుత యుగాన్ని చూడవచ్చని అభిప్రాయపడ్డారు. వైద్య రంగంలో ఇంత వేగంగా మార్పులు రావాలని తాను కోరుకోవడానికి తన సొంత జీవిత అనుభవాలే కారణమని డారియో అమోడెయ్ వెల్లడించారు. తన తండ్రి హెపటైటిస్- సి అనే వ్యాధితో చనిపోయారని, ఆయన మరణించిన కొద్దికాలానికే ఆ వ్యాధిని 95 శాతం నయం చేసే కొత్త మెడిసిన్ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అలాగే తనకు కూడా గతంలో ప్రారంభ దశ క్యాన్సర్ వచ్చిందని, 50 ఏండ్ల క్రితం అయితే ఆ వ్యాధికి అసలు చికిత్సే లేద ఉండేది కాదని చెప్పారు. అందుకే ఏఐ ద్వారా లక్షలాది కుటుంబాల ప్రాణాలను కాపాడవచ్చని నమ్ముతున్నట్లు తెలిపారు. అయితే ఈ సాంకేతికత వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే సమాజం ఏఐని నమ్ముతుందని డారియో అమోడెయ్ స్పష్టం చేశారు.
వ్యాధుల మూలాలను వేగంగా గుర్తించొచ్చు
సాధారణంగా వైద్య శాస్త్రంలో 50 నుంచి 100 ఏండ్ల పాటు జరిగే పరిశోధనలను ఏఐ కేవలం 5 నుంచి 10 ఏండ్లలోనే పూర్తి చేస్తుందని డారియో అమోడెయ్ వివరించారు. ఏఐ సహాయంతో వ్యాధుల మూలాలను వేగంగా గుర్తించవచ్చని, కొత్త మందుల తయారీ ప్రక్రియ ఎంతో సులభం అవుతుందని చెప్పారు. ఇప్పటికే ఆంథ్రోపిక్ సంస్థ తమ ‘క్లాడ్’ ఏఐ ద్వారా వైద్య పరిశోధనలను వేగవంతం చేస్తోందని తెలిపారు. కొత్త మందుల క్లినికల్ ట్రయల్స్ సమయాన్ని ఏఐ ద్వారా 30% వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఏకీభవించిన ప్రముఖ టెక్ దిగ్గజాలు
డారియో అమోడెయ్ అభిప్రాయంతో కొందరు టెక్ దిగ్గజాలు కూడా ఏకీభవిస్తున్నారు. గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ఏఐ సహాయంతో భవిష్యత్తులో పెద్ద పెద్ద జబ్బులను తక్కువ టైంలో నయం చేయవచ్చని చెబుతున్నారు. పదేండ్ల పరిశోధనలను వారాల్లోనే పూర్తి చేయవచ్చని హస్సాబిస్ పేర్కొనగా.. ఏఐ పురోగతితో అమెరికా అధ్యక్షుడికి అందే అత్యుత్తమ వైద్యం సామాన్యులకూ అందుబాటులోకి వస్తుందని మస్క్ అన్నారు. అయితే ఈ విషయంలో ఫార్మా కంపెనీల సీఈఓలు, వైద్య నిపుణులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏఐ ద్వారా ల్యాబ్‌లో కొత్త మందుల ఫార్ములాను త్వరగా కనిపెట్టవచ్చని, కానీ ఆ మందు మనుషులపై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుందంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ గమనించడానికి, ప్రభుత్వ అనుమతులకు 12 ఏండ్లు పడుతుందని గుర్తుచేస్తున్నారు. ఏఐ వైద్య రంగాన్ని పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహం లేకపోయినా.. కేవలం పదేళ్లలోనే అన్ని రోగాలు మాయమవుతాయని చెప్పడం కొంత అతిశయోక్తి కావచ్చన్నారు. 2026 నాటికి ఏఐ రూపొందించిన ఒక్క మెడిసిన్ కూడా పూర్తిస్థాయిలో వాడుకలోకి రాలేదు కాబట్టి తక్కువ టైంలో రోగాలు అంతమవుతాయని చెప్పడం ప్రజల్లో అంచనాలను పెంచడమేనని హెచ్చరిస్తున్నారు.
