- మీడియా సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
- 10 నిమిషాల డెలివరీ ఒత్తిడి, ప్రమాదాల నుంచి రక్షణ
- 14న హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ రూల్స్ ప్రకటిస్తారు
- హెచ్ఐసీసీ దగ్గర ర్యాలీ.. రాజకీయాలకు తావులేదు
- యాప్‌లో రిజిస్టర్ అయినవాళ్లకే మీటింగ్‌కు ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దాదాపు 6 లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సంక్షేమ పథకాలను ఈ నెల 14న లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ద్వారా ప్రకటింప జేస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 2026 నవంబర్ 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరిగే ‘భారత్ సమ్మిట్’లో భాగంగా 14న రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొంటారని చెప్పారు.
బుధవారం సెక్రటేరియెట్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. గిగ్ వర్కర్ల హక్కుల కోసం చట్టం తేవాలని రాహుల్ ఎప్పటినుంచో పట్టుదలతో ఉన్నారని, తాము ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ చట్టం, బోర్డు, రూల్స్ ఎంతవరకు వచ్చాయని ఆరా తీసేవారని గుర్తుచేశారు.
రాజకీయ రహిత ర్యాలీ
14న హెచ్ఐసీసీ దగ్గర జయభేరి, మీనాక్షి టవర్స్ పక్కన ఉన్న మైదానంలో గిగ్ వర్కర్లతో ర్యాలీ, కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు. ఇందులో రాజకీయ ప్రసంగాలు, పార్టీ జెండాలకు తావులేదని, గిగ్ వర్కర్ల హక్కులు, సమస్యలే ఎజెండా అని రాహుల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ తెచ్చిందని, అందులో రిజిస్టర్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన గిగ్ వర్కర్లకే సభలోకి ఎంట్రీ ఉంటుందని తెలిపారు.
డెలివరీ కార్మికులే నేరుగా రాహుల్‌తో మాట్లాడి తమ సమస్యలు చెప్పుకుంటారని, వారి సమక్షంలోనే చట్టం అమలు కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. చట్టానికి వచ్చే పేరు రాహుల్‌కు దక్కుతుందనే భయంతోనే కేంద్రం హడావుడిగా లేబర్ కోడ్ తెచ్చి ప్రకటనలు చేస్తోందని విమర్శించారు.
10 నిమిషాల ఒత్తిడి నుంచి రక్షణ
గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత లేదని, ఎప్పుడు పని ఇస్తారో ఎప్పుడు తీసేస్తారో తెలియని దుస్థితిలో ఉన్నారని మంత్రి అన్నారు. ఇన్సెంటివ్స్ కోసం సంస్థలు పెట్టే ‘10 నిమిషాల డెలివరీ’ నిబంధనతో కార్మికులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వేగంగా వెళ్తూ ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా రక్షణ, బీమా దక్కడం లేదని చెప్పారు. వీళ్లు తమ రెగ్యులర్ ఉద్యోగులు కాదని ఉబెర్ వంటి సంస్థలు మొదట బాధ్యత నుంచి తప్పుకోవాలని చూశాయని, వాటికి నచ్చజెప్పి చట్ట పరిధిలోకి తెచ్చామని వివరించారు. కనీస వేతనాల విధానం లాగే గిగ్ వర్కర్ల చట్టం కూడా దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు.
కేంద్రం కోడ్ నిష్ప్రయోజనం: సలావుద్దీన్
కాంగ్రెస్ మేనిఫెస్టో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అన్నారు. మొదట రాజస్థాన్‌లో, తర్వాత కర్నాటకలో గిగ్ వర్కర్ల చట్టాలు వచ్చాయని, తెలంగాణ చట్టం వాటి కంటే పకడ్బందీగా ఉందని, సామాజికవేత్త నిఖిల్ డే వంటివారి సూచనలు తీసుకున్నారని చెప్పారు.
కేంద్రం తెచ్చిన సోషల్ సెక్యూరిటీ కోడ్ గెజిట్ నోటిఫికేషన్లకే పరిమితమైందని, కంపెనీలు ఏకపక్షంగా ఐడీలు బ్లాక్ చేయడాన్ని అడ్డుకునే నిబంధనలు అందులో లేవని, తెలంగాణ చట్టంలో మాత్రం కార్మికుల రక్షణ, సోషల్ సెక్యూరిటీ సెస్, బోర్డు ఏర్పాటుకు పటిష్ట చర్యలు ఉన్నాయని తెలిపారు. ప్రమాదాల్లో వికలాంగులైన కార్మికులను బోర్డు ద్వారా ఆదుకోవాలన్న తమ విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ప్రేమతోనే సవాళ్లను జయించగలం
పద్మారావు నగర్, వెలుగు: జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని అందించేది ఒక్క ప్రేమ అనే పరమ మంత్రమేనని ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి దేవి (అమ్మ) ఉద్ఘాటించారు. మానవ సేవ, ప్రకృతి పరిరక్షణే భగవంతుని నిజమైన ఆరాధన అని స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రహ్మస్థాన మహోత్సవం ముగింపు సందర్భంగా అమ్మ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రేమ అనేది కేవలం పెదవులతో పలికే మాట కాదని, హృదయాంతరాళాల్లో అనుభూతి చెందుతూ ఆచరణలో చూపించాల్సిన జీవన విధానమని ఆమె పిలుపునిచ్చారు. ఉదయం కార్యక్రమ వేదిక వద్దకు విచ్చేసిన అమృతానందమయి దేవికి పలువురు ప్రముఖులు ఘనస్వాగతం పలికి పుష్పమాలలతో సత్కరించారు.
ఈ మహోత్సవంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే గణేశ్, భక్తి టీవీ మేనేజింగ్ డైరెక్టర్ రమాదేవి, స్వామి బోధమయానంద, స్వామి తత్త్వవిదానంద, సినీ నిర్మాత అభిలాష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో నైతిక, మానవీయ విలువలను పెంపొందిస్తూ అమ్మ అందిస్తున్న నిస్వార్థ సేవలు ఎంతో ప్రశంసనీయమని మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే శ్రీగణేశ్ తో కలిసి అమ్మ సూక్తులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహోత్సవంలో భాగంగా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
