- గర్భంలోని బిడ్డపైనా పీఎం 2.5 ప్రభావం
- ఏక్యూఐ కాదు.. ఆరోగ్య సూచీ కావాలె
- స్కూళ్ల బంద్ వద్దు.. క్లాసుల్లో ప్యూరిఫైయర్లు పెట్టాలె
- ‘స్వచ్ఛ వాయు అభియాన్’ ప్రారంభించాలె
- డబ్ల్యూహెచ్‌వో మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం కరోనా అంతటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని, దాన్ని కరోనా లాగే అత్యవసరంగా, శాస్త్రీయంగా ఎదుర్కోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కాలుష్యాన్ని పట్టించుకోకుండా ఓ తరం మొత్తం ఆరోగ్యాన్ని బలిపెడుతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు. కరోనా అకస్మాత్తుగా వచ్చి కండ్లముందే ప్రాణాలు తీసిందని, కాలుష్యం మాత్రం కనిపించకుండా మెల్లగా ప్రాణాలు తీస్తుందని చెప్పారు. ‘కాలుష్యం అని రాసి ఉన్న డెత్ సర్టిఫికెట్ ఎక్కడా ఉండదు’ అని వ్యాఖ్యానించారు.
తల్లి గర్భంలోనే దెబ్బ
పీఎం2.5 సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి, మాయ ద్వారా గర్భంలోని బిడ్డ దాకా చేరుతాయని ఆమె వివరించారు. కలుషిత ప్రాంతాల్లో నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టే పిల్లలు ఎక్కువగా ఉంటున్నారని, అక్కడ పెరిగే పిల్లల ఊపిరితిత్తులు చిన్నవిగా ఉంటున్నాయని చెప్పారు. పీఎం2.5కు సురక్షిత స్థాయి అంటూ లేదని, ఇప్పుడున్న ఏక్యూఐ బదులు ఆరోగ్యంపై ప్రభావం ఆధారంగా లెక్కించే ‘ఎయిర్ క్వాలిటీ హెల్త్ ఇండెక్స్’ తీసుకురావాలని సూచించారు.
స్కూళ్లు మూసేయొద్దు
కాలుష్యం పెరిగినప్పుడు స్కూళ్లు మూసేయడాన్ని ఆమె వ్యతిరేకించారు. పేద పిల్లల ఇండ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉండవని, ఇంట్లోనూ అదే గాలి పీలుస్తూ చదువు, మధ్యాహ్న భోజనం కోల్పోతున్నారని చెప్పారు. క్లాస్‌రూమ్‌లలో ప్యూరిఫైయర్లు, స్కూల్ బస్సులు, బయట మాస్కులు వంటి చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ తరహాలో ‘స్వచ్ఛ వాయు అభియాన్’ ప్రారంభించాలని, దీర్ఘకాలిక ప్రణాళిక, జవాబుదారీ నాయకత్వం, నిపుణుల కమిటీతో ఆరోగ్యాన్ని కేంద్రంగా పెట్టి పనిచేయాలని సూచించారు. ‘మనల్ని బతికించేది మనం పీల్చే గాలే’ అని అన్నారు.
