అమూల్ పాల ధరలు మళ్లీ పెరిగాయ్.. రేపటి(నవంబర్ 12) నుంచి లీటరుపై రూ.4 పెంపు !

అమూల్ పాల ధరలు మళ్లీ పెరిగాయ్.. రేపటి(నవంబర్ 12) నుంచి లీటరుపై రూ.4 పెంపు !

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే నానా తంటాలు పడుతున్న మధ్య తరగతి ప్రజలకు మరో చేదు వార్త. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కీలక నిర్ణయం తీసుకుంది. పాల ప్యాకెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు నవంబర్ 12, గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. పాల రకాన్ని బట్టి లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు ధర పెరగనుంది. దీంతో ఈ బ్రాండ్ పాల ప్యాకెట్లు వాడే జనం నెత్తిన పిడుగు పడినట్లయింది. అమూల్ తాజా ధరల సవరణలో ప్రధానంగా రెండు రకాల పాల ధరలు పెరిగాయి.

ఈ సంస్థ పాలలో ఎక్కువగా అమ్ముడుపోయే టోన్డ్ మిల్క్ అమూల్ తాజా (Amul Taaza) ప్యాకెట్లపై లీటరుపై రూ.2 పెంచింది. ఇందులో పాల కొవ్వు శాతం 3గా ఉంటుంది. అదే విధంగా.. ఫుల్ క్రీమ్ మిల్క్ అయిన అమూల్ గోల్డ్ (Amul Gold) లీటరుపై రూ.4 పెరిగింది. ఇందులో పాల కొవ్వు శాతం 6గా ఉంటుంది. పాల ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్ ఖర్చులు గణనీయంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అమూల్ మార్కెటింగ్ సంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) వెల్లడించింది. పశువుల మేత ధరలు పెరగడంతో పాల ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావం పడింది.

పచ్చి గడ్డి, ఎండుగడ్డి ధరలతో పాటు పశువుల దాణా తయారీలో ఉపయోగించే మొక్కజొన్న, ఆయిల్ కేక్, మొలాసిస్ వంటి ముడి పదార్థాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. మరోవైపు పాల ప్యాకెట్ల తయారీకి ఉపయోగించే ప్యాకేజింగ్ ఫిల్మ్ ఖర్చులు, రవాణాకు అవసరమైన ఇంధన ధరలు పెరగడంతో ఉత్పత్తి సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. వీటికి తోడు గుజరాత్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవడం కూడా పశుపోషణ, పశుగ్రాసం లభ్యతపై ప్రభావం చూపింది.

ఈ పరిస్థితుల్లో పాల ధరలు పెంచక తప్పడం లేదని అమూల్ సంస్థ చెప్పుకొచ్చింది. అమూల్ ఈ ఏడాదిలో పాల ధరలను పెంచడం ఇది రెండోసారి. గతంలో మే నెలలోనూ పాల ధరలను సవరించింది. తాజాగా నవంబర్‌లో మరోసారి ధరలు పెంచడం వినియోగదారులపై అదనపు భారాన్ని మోపింది.