వచ్చే ఏడాది నుంచే ఇంటర్విలీనం.. విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు

వచ్చే ఏడాది నుంచే ఇంటర్విలీనం..  విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు
  • లెక్చరర్ల సర్వీసులకు భంగం కలగనివ్వం
  • నర్సరీ టు 4 ప్రైమరీ, 5 నుంచి 8 వరకు సెకండరీ,
  • 9 నుంచి12 సీనియర్ సెకండరీగా వర్గీకరణ 
  • అద్దె భవనాల్లో హాస్టళ్లు, గురుకులాలు నడపొద్దు
  • ఏప్రిల్ నెలాఖరులోగా వర్సిటీల్లో రిక్రూట్‌‌మెంట్‌‌ పూర్తి 
  • విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్యను స్కూల్​ఎడ్యుకేషన్​ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూసేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని, విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఆధునిక ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించి, విద్యార్థులను గ్లోబల్ లెవల్‌‌‌‌లో తీర్చిదిద్దడమే తేల్చిచెప్పారు. 

2026 నవంబర్ 11 ( బుధవారం) హైదరాబాద్‌‌‌‌లోని ఎంసీఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీలో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పదో తరగతి తర్వాత సగటున చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారనీ, వారిలో అత్యధికంగా బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలే ఉంటున్నారని పేర్కొన్నారు. 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌‌‌‌లో కొనసాగింపులో ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు, కేజీబీవీల్లో డ్రాపౌట్స్ సంఖ్య చాలా స్వల్పంగా ఉంటోందన్నారు.

 దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే 12వ తరగతి విధానమే విజయవంతంగా అమల్లో ఉందని,  విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు తెస్తున్నామని వివరించారు. నూతన విధానంతో జూనియర్ కాలేజీ సిబ్బంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని సీఎం హామీ ఇచ్చారు. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, రిటైర్‌‌‌‌మెంట్ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని వివరించారు. 

అద్దె భవనాల్లో హాస్టళ్లు నడవడానికి వీల్లేదు

రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని వసతులతో సొంత భవనాల నిర్మాణానికి తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. నిర్మాణాలకు కావాల్సిన నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి బడి, హాస్టల్, రెసిడెన్షియల్స్‌‌‌‌లో తగినన్ని మరుగుదొడ్లు నిర్మించి, నిరంతరం నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత  గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. క్యాంపస్‌‌‌‌లలో ల్యాండ్‌‌‌‌స్కేపింగ్, ఇంటీరియర్, డిజిటల్ పరికరాలు, క్రీడా సామగ్రి, కిచెన్ సామగ్రి సేకరణకు అత్యుత్తమ సంస్థలను ఎంపిక చేయాలన్నారు. 

ఏ దశలోనూ క్వాలిటీలో రాజీ పడొద్దని ఆదేశించారు. క్యూర్  పరిధిలో నిర్మిస్తున్న స్కూళ్ల నిర్మాణ ప్రగతిపైనా సీఎం సమీక్షించి, వాటి నిర్మాణాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, ఇంటర్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఓయూ వీసీ మొలుగరం కుమార్, అంబేడ్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. 

ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలె 

యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు ఇతర లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రిక్రూట్‌‌‌‌మెంట్ నిబంధనలను పక్కాగా పాటించాలని, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, వీసీలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్సిటీ పోస్టుల భర్తీలో డిపార్ట్ మెంట్ యూనిట్​గా రోస్టర్ ప్రక్రియ కొనసాగుతోందని, నిబంధనల ప్రకారం యూనివర్సిటీ యూనిట్​గా రోస్టర్ మార్చాలని చెప్పారు. 

దీనికి సంబంధించిన ఆర్డినెన్స్​నూ త్వరలోనే తీసుకురానున్నామని వివరించారు. ఆ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. డిసెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.
 
మూడు దశల విద్యా విధానం

ఇంటర్ వరకూ మూడు దశల విద్యా విదానం అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.  నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య (ప్రైమరీ), 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ  విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. 12వ తరగతి వరకు విద్యార్థులకు లాంగ్వేజీ, కమ్యూనికేషన్ స్కిల్స్ పై పట్టు సాధించేలా బోధన ఉండాలన్నారు. 12వ తరగతి తర్వాతే విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకుని ఆయా రంగాల్లో నిపుణులుగా ఎదిగేందుకు అవకాశం ఉండాలని సూచించారు. 

ఐటీఐల‌‌‌‌ను ఏటీసీలుగా అప్డేట్‌‌‌‌ చేసిన త‌‌‌‌ర్వాత విద్యార్థుల న‌‌‌‌మోదు పెర‌‌‌‌గ‌‌‌‌డంతో పాటు వాటిలో శిక్షణ పొందిన వారంద‌‌‌‌రికీ ఉద్యోగాలు ల‌‌‌‌భించాయ‌‌‌‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్‌‌‌‌ల అప్‌‌‌‌గ్రేడ్​కు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన నిధుల విడుద‌‌‌‌ల‌‌‌‌ను వేగ‌‌‌‌వంతం చేయాల‌‌‌‌ని ఆదేశించారు.ఈ క్రమంలో శాఖపరమైన ఇబ్బందులు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.