హైదరాబాద్ లో నిర్మాణ రంగానికి నీటి గండం... బోర్లు ఎండిపోయి నిలిచిపోతున్న నిర్మాణాలు

హైదరాబాద్ లో  నిర్మాణ రంగానికి నీటి గండం... బోర్లు ఎండిపోయి నిలిచిపోతున్న నిర్మాణాలు
  • క్యూరింగ్‌‌‌‌ కు కూడా నీళ్లు లేవ్​ 
  • ప్రైవేట్ ట్యాంకర్లపై పెరుగుతున్న భారం
  • గ్రీన్ వాటర్ వినియోగంపై స్పష్టత కావాలంటున్న బిల్డర్లు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: భూగర్భ జలాలు అడుగంటడంతో భవన నిర్మాణ రంగంపై నీటి కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడం, ఉన్న బోర్లలోనూ నీరు  లేకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అపార్ట్‌‌‌‌మెంట్లు, భారీ భవనాల నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ పనులకు అవసరమైన నీటితో పాటు ఇప్పటికే వేసిన స్లాబులు, గోడలకు క్యూరింగ్ చేసేందుకు కూడా నీరు దొరకడం కష్టంగా మారింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. 

కాంక్రీట్ పనులు పూర్తయిన తర్వాత నిర్దిష్ట కాలం పాటు తగినంత నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే కాంక్రీట్‌‌‌‌కు సరైన పటిష్టత వస్తుంది. అయితే, ప్రస్తుతం నీటి కొరత కారణంగా స్లాబులకు సక్రమంగా క్యూరింగ్ చేయలేకపోతున్నామని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల స్లాబులకు నీటిని అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, గోడలకు క్యూరింగ్ చేయడం సాధ్యం కావడం లేదంటున్నారు. నీటిని పొదుపు చేయాలనే ఉద్దేశంతో అవసరమైన స్థాయిలో కూడా నీటిని వినియోగించలేకపోతున్నామని వాపోతున్నారు.

తాత్కాలికంగా నిలిపివేత....

నీటిని ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి నిర్మాణ పనులు కొనసాగిస్తే ప్రాజెక్టు వ్యయం  పెరుగుతుందని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అంచనా వేసిన బడ్జెట్‌‌‌‌కు అదనంగా నీటి కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో కొన్ని అపార్ట్‌‌‌‌మెంట్ల నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. మరికొన్ని చోట్ల నీరు అందుబాటులో ఉన్న రోజుల్లోనే కాంక్రీట్ పనులు చేస్తున్నారు. దీంతో నిర్మాణాలకు నిర్దేశించిన గడువులు కూడా పొడిగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

గ్రీన్ వాటర్‌‌‌‌పై బిల్డర్ల సందేహాలు 

మరోవైపు తాగునీటి వినియోగాన్ని తగ్గించేందుకు శుద్ధి చేసిన మురుగునీటిని గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నిర్మాణ అవసరాలకు వినియోగించాలని జలమండలి ప్రచారం చేస్తోంది. అయితే, ఈ నీటిని వాడే విషయంలో కొందరు బిల్డర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ వాటర్ నాణ్యత, కాంక్రీట్ పనులకు దాని అనుకూలతపై స్పష్టత కావాలని కోరుతున్నారు. 

శుద్ధి చేసిన నీరు అయినప్పటికీ నిర్మాణాల నాణ్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే భరోసా, సంబంధిత పరీక్షల నివేదికలు అందించాలని కోరతున్నారు. ముఖ్యంగా కాంక్రీట్ తయారీ, క్యూరింగ్‌‌‌‌కు ఉపయోగించే నీటి నాణ్యతపై సాంకేతికంగా నిర్ధారణ అవసరమంటున్నారు. వారం కింద జరిగిన ఓ సమావేశంలోనే క్రెడాయి ప్రతినిధులు ఇదే అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 

ట్యాంకర్లే దిక్కు

గతంలో నిర్మాణ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకున్న బోర్ల ద్వారా అవసరమైన నీటిని వినియోగించుకునేవారు. ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గిపోవడంతో చాలా ప్రాంతాల్లో బోర్లు పనిచేయడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. 5 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌‌‌‌కు ప్రాంతాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని నిర్మాణదారులు చెబుతున్నారు. 

రోజుకు ఒకటి రెండు ట్యాంకర్లు అవసరమైన నిర్మాణ ప్రదేశాల్లోనే నీటి కోసం రూ. వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెద్ద అపార్ట్‌‌‌‌మెంట్ల నిర్మాణాల్లో ఈ ఖర్చు మరింత భారంగా మారుతోంది. నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులతో పాటు నీటి సరఫరా వ్యయం కూడా పెరగడంతో బిల్డర్లపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.

నీళ్లు లేక ఇబ్బందులు

భవన నిర్మాణాలకు నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. నిర్మాణంతో పాటు క్యూరింగ్ చేయలేకపోతున్నాం. ఇప్పటికే కొన్ని నిర్మాణాలను పోస్ట్ పోన్​చేసుకోగా, కొన్నింటి నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం భవన నిర్మాణ కార్మికులపై పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో 15లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు. గ్రీన్  వాటర్ ట్యాంకర్లను వాడాలని చెబుతున్నా..ఆ నీరు అంత సేఫ్ కాదని ప్రచారం జరుగుతున్నది. అలాగే కొత్త బోర్లను ప్రభుత్వం బ్యాన్ చేసింది. 

దీంతో మరింత ఇబ్బందులు ఎదుయ్యేలా అవకాశం ఉంది. నగరంలో 250 బోర్ వెల్స్ ఉన్నాయి. వీరు  ఈఎంఐలు చెల్లించలేక వేరే రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం పెద్ద పెద్ద హైరైజ్​భవనాలకు అనుమతులు ఇవ్వొద్దు. కానీ ఇక్కడ ఇస్తూనే ఉన్నారు. 
 –ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ ప్రెసిడింట్