వెలుగు స్పెషల్ : భారత్ సమ్మిట్.. తెలంగాణకు కొత్త బాట! 

వెలుగు స్పెషల్ : భారత్ సమ్మిట్.. తెలంగాణకు కొత్త బాట! 

ప్రపంచం వేగంగా మారుతోంది. అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న పెను సవాళ్లు, సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం దేశాల భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య చర్చలు, సహకారం, పరస్పర అవగాహనను బలోపేతం చేయడానికి హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ వేదికగా నిలవబోతోంది. తెలంగాణ రాజధాని వేదికగా నవంబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజులపాటు రెండో ‘భారత్ సమ్మిట్-2026’ జరగనుంది. సుమారు 70 దేశాల నుంచి 1000 మందికిపైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం, సామాజిక-, ఆర్థిక న్యాయాన్ని సాధించడం, సమాన అవకాశాలను కల్పించడం, దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం భారత్ సమ్మిట్ ప్రధాన లక్ష్యాలు. లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల భాగస్వామ్యంతో జరగనున్న ఈ కార్యక్రమం ప్రపంచ రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్రంగా మారనుంది. ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులు, కొత్త అంతర్జాతీయ వ్యవస్థ ఆవిర్భావం, ఆ పరిణామాలకు భారత్ ఎలా స్పందించాలి అనే అంశాలపై ఈ వేదిక చర్చించనుంది.  వివిధ దేశాలకు చెందిన ప్రగతిశీల రాజకీయ నాయకులు, విధానకర్తలు, మేధావులు, సామాజిక వేత్తలు తమ ఆలోచనలు పంచుకోనున్నారు. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం కూడా ఈ సదస్సు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. ఈ సదస్సులో అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక మొదలగు 12 విషయాలపై చర్చించడంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడులు, సంక్షేమం వంటి అంశాలపై  మరో ఎనిమిది ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 

అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ వేదికగా..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గత ఏడాది జరిగిన తొలి భారత్ సమ్మిట్ సదస్సుకు 100కుపైగా దేశాల నుంచి 450 మందికిపైగా రాజకీయ నాయకులు, విధానకర్తలు, విద్యావేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొని ఆర్థిక న్యాయం, వాతావరణ న్యాయం, లింగ సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక సమ్మిళితత్వం, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై చర్చించారు. 1955 బాండుంగ్ సదస్సు 70వ వార్షికోత్సవం సందర్భంగా 2025లో నిర్వహించిన ఈ సమావేశం ప్రపంచ దేశాల మధ్య సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సంఘీభావం వంటి విలువలకు ప్రాధాన్యం ఇచ్చింది.

తొలి సదస్సులో 44 అంశాలతో కూడిన ‘హైదరాబాద్ తీర్మానం’ ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, సమ్మిళిత పాలన, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువల పట్ల నిబద్ధతను చాటింది. అంతర్జాతీయ సమస్యలపై చర్చించడానికి హైదరాబాద్ ఒక ముఖ్యమైన వేదికగా గుర్తింపు పొందడం గత ఏడాది సదస్సు సాధించిన ప్రధాన ఫలితం. ఈసారి 70 దేశాల భాగస్వామ్యంతో రెండో సదస్సు జరగడం ఆ వేదికకు మరింత విస్తృతిని కల్పిస్తోంది.

నెహ్రూ ఆలోచనా విధాన స్ఫూర్తి

భారత తొలి ప్రధాని జవహర్‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ జయంతి రోజైన నవంబర్ 14న ఈ సదస్సు ముగియనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ శాంతి,  దేశాల మధ్య సహకారం,  స్వతంత్ర విదేశాంగ విధానం, అలీనోద్యమం వంటి అంశాల్లో నెహ్రూ ఆలోచనలు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లోనూ సంభాషణ, దౌత్యం, అంతర్జాతీయ సహకారం ఎంత అవసరమో ఈ సదస్సు చర్చలు గుర్తుచేయనున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఈ సదస్సు ద్వారా గొప్ప అవకాశాలు లభించననున్నాయి.

అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి దృక్పథాన్ని, పెట్టుబడి అవకాశాలను, సంక్షేమ కార్యక్రమాలను, సాంకేతిక రంగంలో సాధించిన పురోగతిని పరిచయం చేయడానికి దోహదపడనుంది.  ఇలాంటి ప్రపంచస్థాయి సదస్సులు రాష్ట్రానికి మరింత అంతర్జాతీయ పరిచయాలను, విధానపరమైన అవగాహనను, భవిష్యత్తులో పెట్టుబడులకు అవసరమైన సంబంధాలను పెంపొందిస్తాయి.

డిసెంబర్  లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ  గ్లోబల్ సమ్మిట్-2026’ 

 తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో  ‘ఇన్వెస్ట్  తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  భారత్ సమ్మిట్ వేదికతో అంతర్జాతీయ రాజకీయ, సామాజిక అంశాలపై చర్చలకు హైదరాబాద్ వేదికగా నిలుస్తుంటే, మరోవైపు గ్లోబల్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌తో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులను ఆకర్షించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికలో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌లో 69 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు, 75కు పైగా కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.  ఈ నేపథ్యంలో ఒకవైపు భారత్ సమ్మిట్ అంతర్జాతీయ సహకారానికి,  మరోవైపు గ్లోబల్ సమ్మిట్ ఆర్థికాభివృద్ధికి వేదికలుగా మారి తెలంగాణ  ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దే ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యానికి పరస్పరం దోహదపడగలవు.

ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం గత ఏడాది తొలి అడుగు వేసిన హైదరాబాద్ ఈసారి మరింత విస్తృతమైన అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ సమ్మిట్ తెలంగాణకు కొత్త బాటగా మారనుంది. నవంబర్‌‌‌‌‌‌‌‌లో భారత్ సమ్మిట్, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో గ్లోబల్ సమ్మిట్.. ఇలా వరుసగా రెండు అంతర్జాతీయ కార్యక్రమాలకు గ్రేటర్ హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణకు గర్వకారణం. ఒకటి ప్రపంచ ప్రజాస్వామ్య, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలకు అవకాశం కల్పిస్తే, మరొకటి రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విస్తరణకు మార్గం సుగమం చేయనుంది. ఈ వేదికల ద్వారా వచ్చే ఆలోచనలు, పెట్టుబడులు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులకు దారితీయాలని ఆశిద్దాం. 

- ఐ.వి మురళీకృష్ణ శర్మ
జర్నలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
  [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.