70 దేశాల నుంచి ప్రతినిధుల రాక..
గాంధీ అహింస, నెహ్రూ అలీన విధానమే ప్రపంచానికి దిక్సూచి
విపక్షాలను శత్రువులుగా చూడడం నియంతృత్వమే: భట్టి
రాహుల్‌ను రీ- లాంచ్ చేయాల్సిన అవసరం లేదు: శ్రీధర్ బాబు
ఇయ్యాల వెల్కమ్ డిన్నర్.. 13, 14న సెషన్లు
హైదరాబాద్, వెలుగు: దావోస్ సదస్సుకు దీటుగా హైదరాబాద్ లో గురువారం నుంచి భారత్ సమిట్ నిర్వహించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక, ఆర్థిక విధానాలపై విస్తృత చర్చే లక్ష్యంగా ఈ ఎడిషన్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. బుధవారం మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తో కలిసి హెచ్ఐసీసీలో డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా విద్వేష, విభజన రాజకీయాలు పెరిగిపోతున్న తరుణంలో మహాత్మా గాంధీ అహింస, నెహ్రూ అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థే ప్రపంచానికి దిక్సూచి అని నేతలు అన్నారు. 70కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు, మేధావులు హాజరవుతారని చెప్పారు.
అంతర్జాతీయ వేదికగా సిటీ: భట్టి
దావోస్ సదస్సు ఎలా పేరు పొందిందో, అదే స్థాయిలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దావోస్ వ్యాపారం, పెట్టుబడులకే పరిమితమైతే, భారత్ సమిట్ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రపంచానికి సమగ్ర మార్గదర్శనం చేస్తుందన్నారు.
రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలో అలీన విధానం ఔచిత్యంపై మీడియా ప్రశ్నించగా, ఏ సైనిక కూటమితోనో గుడ్డిగా చేతులు కలిపితే దేశ సార్వభౌమత్వానికే ముప్పు అని చెప్పారు. ‘ప్రజాస్వామ్యంలో భావజాల వ్యత్యాసాలు ఉండొచ్చు. కానీ ప్రత్యర్థులను శత్రువులుగా చూసి అణచివేయాలనుకోవడం నియంతృత్వ పోకడే. ప్రతిపక్షాలను నిర్మూలించాలనుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు’ అని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
రాహుల్‌కు రీ–లాంచ్ అక్కర్లేదు: శ్రీధర్ బాబు
రాహుల్ గాంధీని రీ–లాంచ్ చేసే విఫల ప్రయత్నమేనంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు. రాహుల్ ఇప్పటికే తిరుగులేని ప్రజానాయకుడిగా ఎదిగారని, ఆయనను ఎవరూ రీ–లాంచ్ చేయాల్సిన పనిలేదన్నారు. ‘మోదీ తర్వాత బీజేపీ నాయకత్వం ఎవరనే భయంతో ఆ పార్టీ నేతలే గందరగోళంలో ఉన్నరు’ అని ఎద్దేవా చేశారు. సమిట్‌లో జెన్–జీ ఆలోచనలు, నిరుద్యోగం, వాతావరణ మార్పులు, ఏఐ వంటి అంతర్జాతీయ సవాళ్లపై 12 ప్రత్యేక సెషన్లు ఉంటాయని, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకు ఈ సదస్సును అవకాశంగా మలుచుకుంటామని చెప్పారు.
ఏఐసీసీ నాయకత్వం సూచనల మేరకు రెండో విడత సదస్సుకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అంతర్జాతీయంగా తీవ్ర మితవాద, ఉదారవాద భావజాలాల మధ్య ఘర్షణ నెలకొందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంలో నైతికత, సమ్మిళిత తత్వం, మానవ గౌరవం కొరవడ్డాయని సల్మాన్ ఖుర్షీద్ ఆరోపించారు.
ఇయ్యాల డిన్నర్.. రేపు, ఎల్లుండి సెషన్లు
సమ్మిట్‌కు కోట్ డి ఐవరీ మాజీ ప్రధాని పాస్కల్ అఫీ ఎన్గెస్సాన్, జకార్తా మాజీ గవర్నర్ అనీస్ బాస్వెదాన్, మలేసియా పీకేఆర్ పార్టీ డిప్యూటీ ప్రెసిడెంట్ నూరుల్ ఇజ్జా అన్వర్ సహా పలు దేశాల పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, రాయబారులు హాజరవుతున్నారు. 12న వెల్కమ్ డిన్నర్లో శశి థరూర్, శామ్ పిట్రోడా, ఎంపీ ప్రణితి షిండే, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. 13న ‘నావిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్’ ప్లీనరీలో ప్రియాంకా గాంధీ, సల్మాన్ ఖుర్షీద్ ప్రసంగిస్తారు. ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో రాష్ట్ర ప్రగతిపై ప్రత్యేక ప్యానెళ్లు ఉంటాయి. 14న ముగింపు సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ సందర్భంగా ‘అవర్ వరల్డ్ ఇన్స్టిట్యూట్’ను ప్రారంభిస్తారు.
