పన్ను మాఫీతో ఈవీల జోరు..రెండేండ్లలో 2.17 లక్షల వాహనాల అమ్మకాలు

పన్ను మాఫీతో  ఈవీల జోరు..రెండేండ్లలో 2.17 లక్షల వాహనాల అమ్మకాలు
  • రూ.2,343 కోట్ల రోడ్ ట్యాక్స్ వదులుకున్న సర్కార్
  • విజన్ 2047కు ఆటోమొబైల్, ఈవీ రంగాలే కీలకం
  • ఈవీ, ఆటోమొబైల్ సంస్థలతో మంత్రి పొన్నం భేటీ
  • గ్లోబల్ సమిట్‌‌లో భాగస్వాములు కావాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు టాక్స్ పన్ను మినహాయింపు ఇవ్వడంతో ఈ రెండేళ్లలో 2, 17, 690 ఈవీ వెహికల్స్ అమ్ముడుపోయాయని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీంతో రూ. 2,343  కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. బుధవారం సెక్రటేరియెట్ లో ఈవీ, ఆటోమొబైల్స్ రంగాలకు చెందిన వారితో మొదటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈవీ పాలసీతో కాలుష్యరహిత తెలంగాణకు అడుగులు వేశామన్నారు. 

దేశంలోనే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని తీసుకువచ్చామన్నారు. విజన్ 2047 లక్ష్యసాధనలో ఆటోమొబైల్, ఈవీ రంగాలు కీలకమన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకు రావాలని ఇన్వెస్టర్లకు మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 లో భాగస్వాములు కావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.