గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై.. ఎల్ నినో దెబ్బ 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై.. ఎల్ నినో దెబ్బ 
  • చిరు వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు కుదేలు
  • 2 లక్షల మంది ముద్రా రుణగ్రహీతలు డిఫాల్టర్లు 
  • ఒక త్రైమాసికంలోనే మహిళా సంఘాల 
  • రుణాల్లో రూ.4,210 కోట్ల కోత
  • 40%  బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బంద్
  • ఎస్ఎల్‌‌బీసీ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌నినో తెచ్చిన కరువు వ్యవసాయాన్నే కాదు, పల్లెల ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన అన్ని రంగాలను సైలెంట్ కిల్లర్‌‌లా దెబ్బతీస్తోంది. పంటలు దెబ్బతిని, సాగు తగ్గి గ్రామాల్లో కొనుగోలు శక్తి పడిపోవడంతో చిరు వ్యాపారాలు, చేతివృత్తులు, చిన్న పరిశ్రమలతో పాటు విద్య, గృహ నిర్మాణ రంగాలు కుదేలవుతున్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‌‌బీసీ) నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కరువు ప్రాంతాల్లో ఆర్థిక ఉపశమన చర్యలు, వడ్డీ రాయితీలు, రుణాల రీషెడ్యూల్ చేపట్టకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితికి చేరుతుందని హెచ్చరించింది.

చిన్న పరిశ్రమలకు ఇబ్బందులు

సూక్ష్మ పరిశ్రమల రుణ ఖాతాల్లో ఏటా కనీసం 10%  వృద్ధి ఉండాల్సి ఉండగా, సెప్టెంబర్ నాటికి మైనస్ 8.31 శాతం నెగెటివ్ వృద్ధి నమోదైంది. ఎంఎస్ఎంఈ విభాగంలో రూ.1,84,740 కోట్ల అడ్వాన్సుల్లో రూ.6,287 కోట్లు నిరర్థక ఆస్తులు (ఎన్‌‌పీఏలు)గా మారగా, అందులో రూ.3,246 కోట్లు సూక్ష్మ యూనిట్లవే. పంట ఉత్పత్తులు లేక ప్రధానమంత్రి ఆహార శుద్ధి పథకం (పీఎంఎఫ్ఎంఈ) కింద 3,091 ప్రతిపాదనలు పెండింగ్‌‌లో పడ్డాయి. 
వ్యవసాయ పంపుసెట్లకు ఇచ్చే సోలార్, గ్రీన్ ఎనర్జీ రుణాల్లో 8.81 శాతం ఎన్‌‌పీఏలుగా మారాయి.

విద్యా రుణాల వార్షిక లక్ష్యం రూ.2,026 కోట్లు కాగా, సెప్టెంబర్ నాటికి బ్యాంకులు ఇచ్చింది రూ.347.35 కోట్లే. గ్రామీణ గృహ నిర్మాణంలో రూ.12,445 కోట్ల లక్ష్యానికి రూ.2,869 కోట్లు (23.06 శాతం) మాత్రమే మంజూరయ్యాయి. కేంద్రం తెచ్చిన రూరల్ హౌసింగ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ (ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఐఎస్ఎస్) కింద రాష్ట్రంలో ఏ ఒక్క బ్యాంకూ ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు.

ముద్రా, మహిళా సంఘాలపై దెబ్బ

చిరు వ్యాపారుల జీవనాధారమైన ముద్రా రుణాల్లో మొండి బకాయిలు రికార్డు స్థాయిలో 7.51 శాతానికి (రూ.1,159 కోట్లు) చేరగా, 2,00,920 మంది అప్పులు కట్టలేక డిఫాల్టర్లుగా మారారు. రూ.50 వేల లోపు ‘శిశు’ రుణాలు బాగా పడిపోయాయి. రూ.14,966 కోట్ల ముద్రా లక్ష్యంలో 44.94 శాతమే ఇవ్వగలిగారు. వ్యవసాయ పనులు లేక మహిళలు కిస్తీలు కట్టలేకపోవడంతో బ్యాంకులు స్వయం సహాయక సంఘాల రుణాలను భారీగా తగ్గించాయి. జూన్‌‌‌‌‌‌‌‌లో రూ.51,433 కోట్లుగా ఉన్న సంఘాల అడ్వాన్సులు సెప్టెంబర్ నాటికి రూ.47,223 కోట్లకు పడిపోయాయి; ఒక్క క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనే రూ.4,210 కోట్ల కోత పడింది. డీఏవై–ఎన్ఆర్ఎల్ఎం కింద రూ.20,536 కోట్ల లక్ష్యానికి రూ.8,875 కోట్లే ఇవ్వగా, 29,320 సంఘాలకు చెందిన రూ.695.27 కోట్లు ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలుగా మారాయి. పీఎంఈజీపీలో ఎన్నడూ లేనంతగా 18.81 శాతం (రూ.185.39 కోట్లు) బకాయిలు ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలయ్యాయి. పోర్టల్ లోపాలతో కొత్త రుణాల పంపిణీ కూడా ఆగిపోయింది.

 పల్లెల్లో బ్యాంకింగ్ చిన్నాభిన్నం

గ్రామాల్లో రైతులు, పెన్షనర్లు, ఉపాధి హామీ కూలీలకు సేవలు అందించే బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీ) నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ దెబ్బతింది. రాష్ట్రంలోని 73,358 మంది బీసీల్లో 29,037 మంది (దాదాపు 40 శాతం) 90 రోజులుగా ఒక్క లావాదేవీ కూడా చేయలేదు. ఇందులో 19,267 గ్రామీణ కేంద్రాలే. ఫినో పేమెంట్స్ బ్యాంకుకు చెందిన 22,878, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌కు చెందిన 4,147 బీసీలు బంద్ అయ్యాయి. దీంతో పింఛన్లు, డీబీటీ డబ్బులు తీసుకునేందుకు రాష్ట్రంలోని వృద్ధులు, పేద గ్రామీణ ప్రజలు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలోని 1.35 కోట్ల జన్‌‌‌‌‌‌‌‌ధన్ బ్యాంక్ అకౌంట్లలో 19,92,750 (14.71 శాతం) ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు.