- పర్యావరణ విధ్వంసానికి బాధ్యులెవరు?
- అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క
వేములవాడ, వెలుగు : దేశంలో కులాలు, మతాలతో ప్రజల్ని విడగొట్టి పాలకులు పాలిస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నంది కమాన్ వద్ద రంగవల్లి విజ్ఞాన కేంద్రం రెండో వార్షికోత్సవం, రంగవల్లి 27వ వర్ధంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో జెన్ జీలు లేవనెత్తిన అంశాలపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ప్రజలు పాలకుల విధానాలను ప్రశ్నిస్తూ, సామాజిక చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత ఆలోచనలకు, వారి ప్రశ్నలకు సమాజం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశంలో పర్యావరణ పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయని, ఎల్ నినో రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. కరువు పరిస్థితులకు ప్రకృతిని కారణంగా చూపించి బాధ్యత నుంచి పాలకులు తప్పించేకోలేరని, విధానాల్లో లోపాలు, మానవ తప్పిదాలపైనా సమీక్ష జరగాలన్నారు.
