వెలుగు స్పెషల్ : తాండూరు కందికి ఇక డిజిటల్ భరోసా! 

వెలుగు స్పెషల్ : తాండూరు కందికి ఇక డిజిటల్ భరోసా! 

తెలంగాణ  గడ్డపై  పుట్టి, తన అద్భుతమైన రుచికి, పోషక విలువలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రసిద్ధ తాండూరు కందిపప్పుకు త్వరలో అత్యాధునిక ‘డిజిటల్ ట్రేసబిలిటీ’ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.  మార్కెట్లో రోజురోజుకూ పెరిగిపోతున్న నకిలీల బెడదను పూర్తిగా అరికట్టడం, అసలైన రైతులకు తగిన గుర్తింపుతోపాటు మార్కెట్లో మెరుగైన ధర కల్పించడమే  లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలు బాధ్యతలను తెలంగాణ టెక్నాలజీ  సర్వీసెస్  లిమిటెడ్ ద్వారా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రముఖ ట్రేసబిలిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాల సంస్థ ‘టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌టీ01’కు అప్పగిస్తూ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో, సుమారు 65 వేల మంది రైతులు 4 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న ‘తాండూరు కంది’ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

తాండూరు కందిపప్పు తెలంగాణలో జీఐ గుర్తింపు పొందిన తొలి వ్యవసాయ ఉత్పత్తిగా నిలిచింది. 2022 డిసెంబరులో ఈ పంటకు జీఐ గుర్తింపు లభించింది. తాండూరు ప్రాంతంలోని నల్లరేగడి నేలలు, సున్నపురాయి నిక్షేపాలు ఈ పప్పు రుచి, ఉడికే గుణం,  నిల్వ సామర్థ్యానికి కారణం. ఇందులో ప్రొటీన్ శాతం 22–24 వరకు ఉంటుంది. ఈ ప్రత్యేకతలను కాపాడుతూ అసలైన ఉత్పత్తికి మార్కెట్లో గుర్తింపు కల్పించడం రైతుల ఆర్థిక పురోగతికి దోహదపడనుంది.

తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన తాండూరు కందిపప్పుకు డిజిటల్ రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీఐ (భౌగోళిక గుర్తింపు) పొందిన ఈ పంట పేరుతో ఇతర ప్రాంతాల కందిపప్పును విక్రయించే అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, అసలైన రైతులకు గుర్తింపు,  మెరుగైన ధర లభించేలా డిజిటల్ ట్రేసబిలిటీ వ్యవస్థను తీసుకురానుంది.

ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు

కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్లాన్ ఇన్ అగ్రికల్చర్ (ఎన్ఈజీపీఏ 2025–26) పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీజీటీఎస్‌‌‌‌‌‌‌‌) ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ట్రేసబిలిటీ సంస్థ టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌టీ01కు ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు. ఈ విధానంలో ప్రతి రైతుకు ప్రత్యేక డిజిటల్ ప్రొఫైల్ రూపొందించి, భూమి వివరాలు, సాగు విస్తీర్ణం, పంట, కోత వివరాలను నమోదు చేస్తారు.

పొలం నుంచి సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ, కొనుగోలుదారుడి వరకు సరుకు ప్రయాణాన్ని డిజిటల్‌‌‌‌‌‌‌‌గా నమోదు చేయనున్నారు.  తాండూరు కందిపప్పు సాగు చేసే నిర్దేశిత భౌగోళిక ప్రాంతంలోని వ్యవసాయ భూములను డిజిటల్‌‌‌‌‌‌‌‌గా మ్యాపింగ్ చేసి, వాటిని నమోదిత జీఐ పరిధితో సరిపోల్చనున్నారు. రైతుల వివరాలు, సాగు భూములు, పంటల సమాచారాన్ని పరిశీలించి అసలైన ఉత్పత్తిని ధ్రువీకరించే విధానాన్ని రూపొందించనున్నారు. 

తాండూరు కందిపప్పు పట్ల విశ్వసనీయత

వినియోగదారులకు అసలైన ఉత్పత్తిని గుర్తించే వీలు కలగడంతోపాటు, తాండూరు కందిపప్పుపై మార్కెట్లో విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యవస్థ విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయి ధ్రువీకరణ, సరఫరా గొలుసులోని ప్రతి దశలో సమాచార నమోదు కీలకం. సాధారణంగా పంట మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి చేరిన తర్వాత దానిని పండించిన రైతు వివరాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. కొత్త విధానం ద్వారా రైతు నుంచి కొనుగోలుదారుడి వరకు ఉత్పత్తి వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. 

దీనివల్ల రైతుల ఉత్పత్తికి గుర్తింపు లభించడంతోపాటు, కొనుగోలుదారులతో బేరసారాలు చేసే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా రైతుల భాగస్వామ్యాన్ని గుర్తించి ప్రోత్సహించడానికీ ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం ఇవ్వనుంది. రైతులకు మార్కెట్ అనుసంధానం,  నాణ్యత  ఆధారిత ధరలు, సమర్థవంతమైన అమలు తోడైతేనే ఆశించిన ప్రయోజనాలు అందుతాయి. తాండూరు కందిపప్పుకు డిజిటల్ గుర్తింపు, రైతులకు న్యాయమైన ధర, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తి అనే మూడు లక్ష్యాలు సమర్థంగా అమలైతే, ఈ ప్రసిద్ధ తాండూరు కందిపప్పునకు అత్యాధునిక ‘డిజిటల్ ట్రేసబిలిటీ’ తెలంగాణ వ్యవసాయ రంగానికి ఆదర్శంగా నిలవనుంది. 

- వై. రవితేజ, 
ఏఈవోల రాష్ట్ర అధికార ప్రతినిధి

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
  [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.