- స్లాబ్ కోసం రూ.2 లక్షలు
- అర్హులను గుర్తిస్తున్న ఆఫీసర్లు
మెదక్, వెలుగు: అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం మొదటి విడతలో ఇందిరమ్మ కమిటీలు గుర్తించిన వారికి, సొంత జాగా ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చిన వారికి అవకాశం కల్పించారు. రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా ఆఫీసర్లు గ్రామాల్లో సర్వే చేసి గుర్తించిన అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నారు.
తాజాగా ప్రభుత్వం 'రూఫ్ రిప్లేస్ మెంట్ స్కీం' తీసుకొచ్చింది. గ్రామాల్లో మెజారిటీగా పెంకుటిళ్లు ఉండటంతో కోతుల బెడద కారణంగా వాటి పైకప్పులు దెబ్బతింటున్నాయి. కోతులు గుంపులుగా ఇళ్లపైకి దూకడం, కొట్లాడుకోవడంతో పెంకులు పగిలిపోతున్నాయి. కర్రలు, మట్టితో నిర్మించిన పైకప్పులు దెబ్బతింటున్నాయి. వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరుతోంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో గోడలు నిర్మించుకున్నప్పటికీ స్లాబ్ వేసుకోలేక రేకులతో పైకప్పు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు వేసవిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన గోడలు ఉండి, పైకప్పు పెంకులు లేదా రేకులతో ఉన్న ఇళ్లకు స్లాబ్ వేసుకునేందుకు రూఫ్ రిప్లేస్ మెంట్ స్కీం కింద రూ. 2 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, రూఫ్ రీప్లేస్ మెంట్ స్కీమ్ కింద మరో 500 మందికి అవకాశం కల్పించనున్నారు.
లబ్ధిదారుల ఎంపిక ఇలా..
రూఫ్ రీప్లేస్ మెంట్ స్కీమ్ కు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇళ్లు 600 చదరపు అడుగుల విస్తీర్ణం లోపు ఉండాలి, గోడలు పటిష్టంగా ఉండి పైకప్పు పెంకులు లేదా రేకులు ఉండాలి. ఆ కుటుంబానికి మరో ఆర్ సీసీ ఇల్లు ఉండకూడదు. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. ఈ మేరకు హౌసింగ్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు అర్హులైన వారిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అర్హులు గ్రామ పంచాయతీ సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవచ్చు. హౌసింగ్ శాఖ ఏఈలు, ఎంపీడీవోల ద్వారా కూడా గ్రామాల్లో సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించనున్నారు.
400 మందిని గుర్తించాం..
గోడలు పటిష్టంగా ఉండి పైకప్పు పెంకులు లేదా రేకులు ఉన్న కుటుంబాలకు రూఫ్ రీప్లెస్ మెంట్ స్కీమ్ మంచి అవకాశం. ఈ స్కీమ్ కింద స్లాబ్ వేసుకునేందుకు రూ.2 లక్షలు మంజూరు చేయడం చేస్తాం. హౌసింగ్ డిపార్టట్మెంట్ ద్వారా సర్వే చేసి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 400 మంది అర్హులను గుర్తించాం. ఇన్చార్జి మంత్రి ద్వారా ఆమోదం తీసుకుని త్వరలో వారికి కలెక్టర్ ద్వారా మంజూరు ఇస్తాం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. (- మాణిక్యం, హౌసింగ్ పీడీ, మెదక్ జిల్లా)
