- మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు
మెదక్ టౌన్, వెలుగు : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధిస్తూ మెదక్‌జిల్లా ఫోక్సో కోర్టు జడ్జి ఆర్.ఎం.శుభవల్లి బుధవారం తీర్పునిచ్చారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. చదువును మధ్యలో ఆపేసి ఇంటి వద్ద ఉంటున్న మైనర్ బాలికకు ఆమె తల్లి కామారెడ్డి జిల్లాకు చెందిన మామిడ్ల సంజీవ్ అనే వ్యక్తితో వివాహం చేయాలని భావించింది.
ఈ క్రమంలో ఇరువురి ఫొటోలు, ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అప్పటి నుంచి బాలిక, సంజీవ్ ఫోన్లో మాట్లాడుకునేవారు. అయితే వయస్సు తక్కువగా ఉండటంతో పెళ్లి చేయడం సరికాదని ఆమె తల్లి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో 2021 మే 11న ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక కామారెడ్డిలోని స్నేహితురాలి ఇంట్లో రెండు, మూడు రోజులు ఉంది. అనంతరం సంజీవ్‌కు ఫోన్ చేయగా, అతడు బాలికను బస్టాండ్ వద్దకు పిలిపించుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ వివాహం చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు తన వద్దే ఉంచుకున్నాడు.
బాలిక కనిపించడం లేదని ఆమె తల్లి మనోహరాబాద్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలుసుకున్న నిందితుడు, బాలికను బస్సు ఎక్కించి ఇంటికి పంపించాడు. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై రాజు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ఆఫీసర్‌గా వ్యవహరించిన తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ సమగ్ర విచారణ జరిపి అవసరమైన సాక్షాలను సేకరించారు. ఇరుపక్షాల వాదనలు, సాక్షాలను పరిశీలించిన జిల్లా పోక్సో కోర్టు జడ్జి ఆర్.ఎం. శుభవల్లి నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన పోలీసు ఆఫీసర్లు, సిబ్బందిని ఆయన అభినందించారు.
