చినమల్లయ్య సేవలు చిరస్మరణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్

చినమల్లయ్య సేవలు చిరస్మరణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. చినమల్లయ్య వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన సేవలను స్మరించుకున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన చినమల్లయ్య ఇందుర్తి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు. 

తెలంగాణ సాయుధ పోరాటంలో కిలక పాత్ర పోషించిన చినమల్లయ్య.. బానిసత్వ విముక్తి, వెట్టిచాకిరి నిర్మూలనతో పాటు పేదల భూముల ఆక్రమణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘాల నిర్మాణంలో కీలక భూమిక పోషించడంతోపాటు కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడారని కొనియాడారు. చినమల్లయ్య జీవితం నేటి తరం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు ఆదర్శమని మంత్రి పొన్నం పేర్కొన్నారు.