- రూ.5 వేల కోట్లు సేకరించనున్న ఐఓబీ
- సెంట్రల్ బ్యాంక్ టార్గెట్ రూ.7 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో వాటాల అమ్మకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సెబీ నిబంధనలకు అనుగుణంగా ప్రజల వాటాను పెంచే లక్ష్యంతో కొత్త షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తున్నాయి. ఐఓబీ ఈ ఆర్థిక సంవత్సరంలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) మార్గంలో రూ.5,000 కోట్ల వరకు సమీకరించేందుకు అనుమతి పొందింది.
అవసరమైన అనుమతుల్లో దాదాపు అన్నీ పూర్తయ్యాయని బ్యాంక్ ఎండీ శ్రీవాస్తవ తెలిపారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రస్తుత క్వార్టర్ చివర్లో లేదా నాలుగో క్వార్టర్ ప్రారంభంలో షేర్ల జారీ చేపట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. పూర్తి మొత్తం సమీకరిస్తే ప్రభుత్వ వాటా 92.44 శాతం నుంచి సుమారు 86 శాతానికి తగ్గనుంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా క్యూఐపీ ద్వారా నిధుల సమీకరణకు ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన అనుమతులు పొందడంతో పాటు మర్చంట్ బ్యాంకర్లను నియమించింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం క్యూఐపీ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, రైట్స్ ఇష్యూ వంటి మార్గాల్లో రూ.7,000 కోట్ల వరకు సమీకరించేందుకు వాటాదారుల ఆమోదం పొందింది. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో కనీసం 25 శాతం వాటా ప్రజల చేతుల్లో ఉండాలి. ఈ షేర్ల జారీతో బ్యాంకులకు అదనపు మూలధనం సమకూరడంతో పాటు ప్రభుత్వ వాటా తగ్గనుంది.
