విదేశాలకు వెళ్లితే డాలర్లలో సంపాదించవచ్చు. జీతం, జీవితం రెండూ మారిపోతాయ్. దీంతో భారీగా డబ్బులు ఆదా చేయవచ్చని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అక్కడి కాస్ట్ ఆఫ్ లివింగ్, పన్నుల భారంతో ఆ ఆశలు ఒక్కోసారి ఆవిరైపోతుంటాయి. సరిగ్గా ఇదే విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఓ భారతీయ మహిళ లెక్కలతో సహా పంచుకోవటం సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. అమెరికాలో నెలకు రూ.7లక్షల 50వేలు సంపాదిస్తున్నప్పటికీ.. తాము ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అమెరికాలో నివసిస్తున్న నితిన్ మల్హోత్రా అనే భారతీయ యువకుడు తన సోదరి మహిమా రాథీతో కలిసి చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. "అమెరికాలో కోటి రూపాయలు సంపాదించినా మా చెల్లెలు మిడిల్ క్లాసే" అనే క్యాప్షన్‌తో నితిన్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మహిమ తన నెలవారీ సంపాదన, ఖర్చుల చిట్టాను పూసగుచ్చినట్లు వివరించారు.
మహిమ నెలకు 8వేల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 7.5 లక్షలు) సంపాదిస్తున్నారు. అయితే ఆ సంపాదన మొత్తం ఎక్కడికి పోతుందనే దానిపై ఆమె స్పష్టమైన లెక్కలు చెప్పారు. పన్నుల రూపంలో ప్రతి నెలా రూ. లక్షా 40వేలు కట్ అవుతాయి. ఇక హోమ్ లోన్ రూపంలో రూ. 2లక్షల 30వేలు పోతుందట. ఇక ఫుడ్ కోసం రూ. 94వేలు, మెడికల్ ఇన్సూరెన్స్‌కు రూ. 47వేలు, కారు ఇన్సూరెన్స్ పెట్రోల్ కోసం మరో రూ.46వేలు ఖర్చవుతాయని వివరించింది.
వీటితో పాటు ఫోన్, ఇంటర్నెట్ బిల్లులకు రూ.46వేలు, పిల్లల ఖర్చుల నిమిత్తం రూ.28వేలు, ఇతర ఖర్చుల కోసం రూ.19వేలు ప్రతి నెల కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఖర్చులన్నీ పోను ఆమె చేతిలో మిగులుతున్నది కేవలం రూ.95వేలు మాత్రమే అంట. అయితే ఇందులో తన వ్యక్తిగత ఖర్చులు ఏవీ కలపలేదని ఆమె స్పష్టం చేశారు. భారతదేశంలో ఉన్నప్పుడు తాము ఏడాదికి రూ.15 లక్షలు సంపాదించినప్పటికీ.. ఇక్కడకంటే ఎక్కువ సేవింగ్స్ చేసుకోగలిగేవాళ్లమని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు. అమెరికాలో మిడిల్ క్లాస్‌గా బతకడమంటే సొంతిల్లు, కారు, స్వచ్ఛమైన గాలి, తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు కలిగి ఉండటమేనని కొందరు అభిప్రాయపడ్డారు. భారత్‌లో లగ్జరీగా భావించే ఈ సదుపాయాలు అమెరికాలో మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉంటాయని వారు సమర్థించారు. అయితే భారత్‌లో తక్కువ సంపాదన ఉన్నా ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోవచ్చని, మెరుగైన జీవన ప్రమాణాల కోసమే విదేశాలకు వెళ్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. సంపాదన ఎంత ఉన్నా, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటే మిడిల్ క్లాస్ కష్టాలు ఎక్కడికీపోవని తాజా పోస్ట్ నిరూపిస్తోంది. మంచి జీవితం కావాలని విదేశాలకు వెళ్లి మళ్లీ ఇండియాలో మిడిల్‌క్లాస్ ఆలోచనలతో డబ్బులు మిగలట్లే అనటం తెలివితక్కువతనమే అంటున్నారు మరికొందరు నెటిజన్లు.
