సమస్యలు ఉన్న చోటే విజేతలు పుడతారని అంటారు. ఆ సమస్యకు పరిష్కారం చూపెడుతో ఎందరికో ఆదర్శంగా మారుతుంటారు. అలాంటి స్టోరే ఇది. పెద్ద పెద్ద సైంటిస్టులకే సాధ్యం కానిది చిన్న పిల్లలు.. ఇంకా ఇంటర్నీడియట్ స్థాయిలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు తక్కువ ధరలో ఎయిర్ ప్యూరిఫైయర్ తయారు చేసి ప్రపంచాన్ని ఆకర్షించారు. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ టెక్నాలజీని అందిస్తూ.. ఎన్నో అవార్డులు గెలుచుకుంటున్న ఈ యువ శాస్త్రవేత్తల స్టోరీ ఏంటో చూద్దాం.
ఇప్పుడు యువత గురించి చెప్పాలంటే ఏం చెబుతాం.. కొందరు పద్ధతిగా చదువుకుంటుంటే.. మరి కొందరు టెన్త్, ఇంటర్ లోనే గంజాయి, ఆల్కహాల్, డ్రగ్స్ కు అలవాటు పడుతూ క్రైమ్ లో పాల్గొంటుడటం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశం. కానీ ఈ యువకుడు తన సిటీ, తన దేశం ఎదుర్కొంటున్న సమస్యకు తానెందుకు పరిష్కారం కనుక్కోకూడదు అనుకున్నాడు. తక్కువ ధరకు ఎయిర్ ప్యూరిఫైయర్ తయారు చేసి ఆదర్శంగా నిలిచాడు. కొంత మంది విద్యార్థులలో సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణపై ఎంత బాద్యత ఉందో గుర్తు చేసే సందర్భం ఇది.
ఢిల్లీ సిటీలో గాలి కాలుష్యం ప్రతి ఏడాది వేలాది మంది పిల్లల ఆరోగ్యాన్ని, చదువును ప్రభావితం చేస్తున్న క్రమంలో.. ఒక యువ విద్యార్థి సాధించిన విజయం దేశవ్యాప్తంగా ఎందరో మేధావుల దృష్టిని ఆకర్షిస్తోంది. సంస్కృతి స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న క్రిష్ అగర్వాల్ సాధారణ టేబుల్ ఫ్యాన్లు, వాల్ ఫ్యాన్లను తక్కువ ఖర్చుతో ఎయిర్ ప్యూరిఫయర్లుగా మార్చే పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఈ కృషికి గాను 2026 డయానా అవార్డు రోల్ ఆఫ్ హానర్‌లో స్థానం లభించింది.
ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తో కలిసి ప్రయోగం
క్రిష్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ కో ఫైండర్ గా మరొక యువకుడు వసంత్ వ్యాలీ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న సమర్థ్ మీటిల్ నలిచాడు. ఇద్దరూ కలిసి ‘ప్రాజెక్ట్ వాయు’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారి లక్ష్యం సాధారణ పాఠశాలల్లో, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లు, పేదలు చదువుకునే పాఠశాలల్లో క్లాస్ రూమ్ లలో నాణ్యతను మెరుగుపరచడం. సాధారణంగా ఒక మంచి ఎయిర్ ప్యూరిఫయర్ కొనాలంటే దాదాపు పదివేల రూపాయల వరకు ఖర్చవుతుంది. అలాంటి పరికరాలను ప్రతి తరగతి గదిలో అమర్చడం అనేక పాఠశాలలకు అసాధ్యం. ఈ సమస్యను గుర్తించిన క్రిష్, సమర్థ్ ఇప్పటికే పాఠశాలల్లో ఉన్న ఫ్యాన్లను ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో పరిష్కారం కనుగొన్నారు.
ప్రాజెక్ట్ వాయు రూపొందించిన ఫిల్టర్ ధర కేవలం 140 రూపాయలు మాత్రమే. ఈ ఫిల్టర్‌ను సాధారణ టేబుల్ ఫ్యాన్ లేదా వాల్ ఫ్యాన్‌పై అమర్చవచ్చు. ఇది ఎలక్ట్రెట్ ఫిల్టర్ మీడియాను ఉపయోగించి పనిచేస్తుంది. ఈ మీడియా ఎలక్ట్రోస్టాటిక్ ఆకర్షణ ద్వారా PM2.5 వంటి సూక్ష్మ కణాలను సమర్థవంతంగా పట్టుకుంటుంది. ఫిల్టర్‌ను ఉబ్బించిన తర్వాత అది బెలూన్ ఆకారంలో మారి దాదాపు ఐదు చదరపు అడుగుల ఫిల్టరింగ్ ఉపరితలాన్ని అందిస్తుంది. దీన్ని ఫ్యాన్ గ్రిల్‌పై ఎలాస్టిక్ లైనింగ్‌తో సులభంగా అమర్చవచ్చు. ఇన్‌స్టాలేషన్‌కు ఒక్క నిమిషం కూడా పట్టదు. దీన్ని ఇన్ స్టాల్ చేయడానికి ఎలాంటి సాధనాలు లేదా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. ఫిల్టర్ గాలిని సులభంగా పాస్ అయ్యేలా రూపొందించారు కాబట్టి ఫ్యాన్ పనితీరుపై పెద్దగా ప్రభావం ఉండదు.
ప్రతి నెలా ఈ ఫిల్టర్‌ను మార్చాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ వాయు పాఠశాలలకు ఈ ఫిల్టర్లను ఉచితంగా అందిస్తోంది. లాభాపేక్ష లేకుండా పెద్ద ఎత్తున పంపిణీ చేయడమే వారి లక్ష్యం. ఇప్పటికే ఢిల్లీలోని పేద పాఠశాలల్లో ఈ ఫిల్టర్లు పంపిణీ చేశారు. 10 వేలకుపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడం అంటా చాలా గొప్ప విషయం. ఎందుకంటే దిల్లీలో చలికాలంలో గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉంటుంది. పిల్లలు రోజుకు అనేక గంటలు క్లాస్ రూమ్‌లలో గడుపుతారు. కాలుష్యం వల్ల వారి శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా ఏకాగ్రత, చదివే సామర్థ్యం కూడా తగ్గుతాయి. అలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో, ఇప్పటికే ఉన్న వసతులతో గాలిని శుభ్రపరిచే ఈ పద్ధతి చాలా ఉపయోగకరం.
క్రిష్ కేవలం ఫిల్టర్‌ను తయారు చేయడంతోనే ఆగలేదు. పర్యావరణ సమస్యలపై శాస్త్రీయ ఆధారాలతో కూడిన పరిష్కారాలను ప్రోత్సహిస్తూ, యువతను వాతావరణ మార్పు చర్యల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాడు. క్రిష్ చేస్తున్న కృషి డయానా అవార్డు కమిటీ దృష్టిని ఆకర్షించింది. డయానా అవార్డు ప్రిన్సెస్ డయానా జ్ఞాపకార్థం యువత చేసే మార్పును గుర్తించి ఇస్తారు. ఈ అవార్డు పొందడం క్రిష్‌కు మాత్రమే కాకుండా మొత్తం భారత యువతకు గర్వకారణం అని అంటున్నారు.
ప్రాజెక్ట్ వాయు విజయం దేశంలోని అన్ని సిటీలకు అవసరమైనది. కాలుష్యం అనేది కేవలం ప్రభుత్వాలు, పెద్ద సంస్థలు పరిష్కరించాల్సిన సమస్య కాదు. సాధారణ విద్యార్థులు కూడా క్రియేటివ్ ఆలోచనలతో పెద్ద మార్పు తీసుకురావచ్చునని ఈ ఉదాహరణ నిరూపిస్తోంది. భవిష్యత్తులో ఈ ఫిల్టర్లను మరిన్ని పాఠశాలలకు, కమ్యూనిటీ సెంటర్లకు విస్తరించాలని ప్రాజెక్ట్ వాయు బృందం ఆశిస్తోంది.
సమాజం పట్ల ఉన్న బాధ్యత, క్రియేటివిటీ ఉంటే.. వయసుతో పనిలేదని.. వనరుల అవసరం అంతగా ఉండదని చెప్పే ప్రత్యక్ష సాక్షం ఈ ఆవిష్కరణ. కృష్ అగర్వాల్, సమర్థ్ మీటిల్ చేసిన ఈ కృషి ఢిల్లీ స్కూళ్లలో వేలాది పిల్లలకు శుభ్రమైన గాలిని అందించడమే కాకుండా, దేశవ్యాప్తంగా యువతలో స్ఫూర్తిని నింపుతోంది.
