ట్రంప్‌పై మాస్ ట్రోలింగ్: వాషింగ్టన్‌లో 'ది ఫూట్ సోల్జర్' విగ్రహం కలకలం

ట్రంప్‌పై మాస్ ట్రోలింగ్: వాషింగ్టన్‌లో 'ది ఫూట్ సోల్జర్' విగ్రహం కలకలం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వినూత్న వ్యంగ్య చిత్రాలకు, ట్రోలింగ్‌కు కేంద్రంగా నిలిచారు. వెటరన్స్ డే ముందు వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ సమీపంలో ట్రంప్‌ను ఎద్దేవా చేస్తూ ఏర్పాటు చేసిన ఒక భారీ గోల్డెన్ విగ్రహం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. 'ది ఫూట్ సోల్జర్' అనే పేరు పెట్టిన ఈ విగ్రహం ద్వారా ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ విగ్రహం రూపం చాలా విభిన్నంగా ఉంటుంది. కుర్చీలో కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ తన కుడి పాదానికి ఉన్న బూటును తీసేసి.. కాలి వేళ్లను తడుముకుంటున్నట్లు, రుద్దుకుంటున్నట్లు ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 1968లో వియత్నాం యుద్ధ సమయంలో సైన్యంలో చేరకుండా ఉండేందుకు ట్రంప్ తనకు కాలి మడమల సమస్య ఉందని మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని మిలిటరీ సర్వీస్ నుంచి తప్పించుకున్నారు. సరిగ్గా ఈ పాత వివాదాన్నే ఎంచుకుని ఈ విగ్రహాన్ని రూపొందించారు.

ఈ విగ్రహం కింద ఉన్న పీఠంపై ఏర్పాటు చేసిన ఫలకంపై వ్యంగ్యంగా రాసి ఉన్న వాక్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. "మా కమాండర్ ఇన్ చీఫ్ డొనాల్డ్ జె. ట్రంప్ సేవలను మేము గౌరవిస్తున్నాము. ఆయన సైనిక నియామకం నుంచి తప్పించుకోవడానికి ముందు వరుసలో నిలబడిన ఒక ఆదర్శ సైనికుడు.." అంటూ ఎద్దేవా చేశారు.

'సీక్రెట్ హ్యాండ్‌షేక్' అనే అజ్ఞాత సటైరికల్ ఆర్ట్ యాక్టివిస్ట్ గ్రూప్ ఈ విగ్రహాన్ని రహస్యంగా ఏర్పాటు చేసింది. ట్రంప్ విధానాలను, గత చరిత్రను విమర్శిస్తూ ఈ గ్రూప్ ఇలాంటి వింత కళాఖండాలను ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ కలిసి ఉన్నట్లు ఒక చెక్క శిల్పాన్ని కూడా వీరు ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు.

అంతేకాకుండా ఈ విగ్రహంతో పాటు 'టోయ్' అనే ఆరు అడుగుల భారీ కాలి బొటనవేలు మాస్కాట్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఇది ట్రంప్ మాట్లాడే శైలిని అనుకరిస్తూ జనాలను విపరీతంగా నవ్విస్తూ.. రాజకీయంగా పెద్ద ఎత్తున ట్రోల్ చేయడానికి కారణమైంది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి గతంలో సైనిక సేవ నుంచి ఎలా తప్పించుకున్నారనే విషయాన్ని గుర్తుచేస్తూ ఈ విగ్రహం ద్వారా నెటిజన్లు, ప్రజలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. మెుత్తానికి ట్రంప్ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోవటంతో అతని పాత తప్పులను ప్రస్తుతం అక్కడి విమర్శకులు ఎత్తిచూపుతున్నారు.