మళ్లీ సిగరెట్ల రేట్లు పెంచిన ITC : ఇంత దారుణంగా పెంచుతారా..!

మళ్లీ సిగరెట్ల రేట్లు పెంచిన ITC : ఇంత దారుణంగా పెంచుతారా..!

పొగతాగే అలవాటు ఉన్నవారికి ITC వరుస షాకులు ఇస్తోంది. దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉన్న 'గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం' సిగరెట్ల ధరలను మరోసారి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో స్మోకర్స్ తమ పాకెట్ నుంచి ఎక్కువ డబ్బు వెచ్చించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పన్నుల భారం, నిర్వహణ వ్యయం పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా రేట్ల మార్పుతో 10 సిగరెట్లు ఉండే ఒక గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం ప్యాకెట్ ధర ఇప్పుడు రూ. 135కి చేరుకుంది. అంతకుముందు ఈ ప్యాకెట్ ధర రూ.125గా ఉండేది. తాజా పెంపు ద్వారా ఒక్కో ప్యాకెట్‌పై అదనంగా రూ.10 పెరిగింది. ప్రత్యేకించి 60 నుంచి 70 మి.మీ పరిమాణం గల రెగ్యులర్-సైజ్ ఫిల్టర్-టిప్డ్ గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్లపైనే ఈ కొత్త MRP వర్తించనుంది.

గత కొద్ది నెలలుగా ఐటీసీ కంపెనీ సిగరెట్ల ధరలను వరుసగా పెంచుకుంటూ పోతోంది. కేవలం 2026లోనే ఈ బ్రాండ్‌పై ధరలు పెరగడం ఇది 2వ సారి. సరిగ్గా గత జూన్ నెలలోనూ ఇదే ప్యాకెట్ ధరను రూ.115 నుంచి రూ. 125కి కంపెనీ పెంచింది. అంటే జూన్‌కు ముందు కేవలం రూ. 115 ఉన్న ఒక ప్యాకెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ.20 పెరిగి రూ.135కి చేరింది. దీన్ని బట్టి చూస్తే కొన్ని నెలల్లోనే సుమారు 17.4 శాతం మేర రేట్లను పెంచేసింది ఐటీసీ. 

ప్రస్తుతం సిగరెట్ల మార్కెట్లో విపరీతమైన పన్నుల భారం, అమ్మకాలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకే ఐటీసీ ఈ తాజా ధరల పెంపు బాట పట్టింది. అదనపు పన్ను భారాన్ని, ఇతర ఖర్చుల ఒత్తిడిని భర్తీ చేసుకునేందుకు రిటైల్ ధరలను పెంచడం ఒక్కటే మార్గంగా తయారీదారు భావిస్తున్నారు. అయితే ఇలా తరచూ ధరలు పెంచడం వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం పడటంతో పాటు, సిగరెట్ల డిమాండ్‌పై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.

కేవలం సిగరెట్ల వ్యాపారాలపైనే కాకుండా భవిష్యత్ వృద్ధి కోసం ఇతర రంగాలపై కూడా ఐటీసీ గట్టిగా దృష్టి పెట్టింది. FMCG పోర్ట్‌ఫోలియోను విస్తరించడం, పేపర్‌బోర్డ్స్ వ్యాపారాన్ని పునరుద్ధరించడం, కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేయడంపై కంపెనీ ప్రధానంగా పనిచేస్తోంది. యోగా బార్, ప్రసుమ వంటి డిజిటల్-ఫస్ట్ బ్రాండ్‌లను మరింత పెద్ద ఎత్తున విస్తరిస్తూ ముందుకు వెళ్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రంగాల నుంచి వచ్చిన సానుకూల ఫలితాలే, సిగరెట్లపై పన్నుల భారాన్ని కొంతవరకు తగ్గించడానికి దోహదపడ్డాయి. ఏదేమైనా ధరల పెంపు మాత్రం స్మోకర్లకు పెద్ద షాక్ అనే చెప్పాలి.