రోజుకో వస్తువు ధర పెరుగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దీంతో ఇంటి బడ్జెట్ అంచనాలు తలకిందులవుతున్నాయి. చేతిలో ఉన్న సంపాదన రోజురోజుకూ కరిగిపోతుంటే.. నిత్యవసరాల నుంచి లగ్జరీ వస్తువుల వరకు ప్రతి దాని ధరలు పెరిగిపోతూ షాక్ ఇస్తున్నాయి. పాలు, పెరుగు వంటి ఆహార పదార్థాల నుంచి వంట నూనెలు, గ్యాస్, డ్రైఫ్రూట్స్, చివరికి సిగరెట్ల వరకు అన్నింటి ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. గడచిన 2 నెలల్లో జరిగిన వరుస ధరల పెంపుదల మధ్యతరగతి, పేద ప్రజల బడ్జెట్లను అతలాకుతలం చేస్తోంది.
పాలు, పెరుగు ధరల బాదుడు:
ప్రతి ఇంటి రోజువారీ బడ్జెట్ను దెబ్బతీసేలా డైరీ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో మదర్ డెయిరీ లీటరు పాలపై రూ. 2 నుంచి రూ. 4 వరకు పెంచగా, ఫుల్ క్రీమ్ పాలు లీటరు రూ. 76కి చేరాయి. అమూల్ కూడా తాజా, గోల్డ్ పాలను పెంచేసింది. ఇక కర్ణాటకలో నందిని పాల ధరలు లీటరుకు రూ. 8 నుంచి రూ. 12 వరకు పెరగడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అక్కడ టోన్డ్ మిల్క్ రూ. 54కి, పెరుగు ప్యాకెట్ ధరలు కూడా పెరిగాయి. కర్ణాటక ప్రభుత్వం సేకరణ ధరను పెంచడంతో నేరుగా వినియోగదారులపై భారం పడింది.
నెయ్యి, వెన్న, పన్నీర్ ధరల మోత:
పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ అమూల్ సంస్థ ఒక కేజీ నెయ్యి కార్టన్ ధరను రూ. 630 నుంచి రూ. 680కి పెంచింది. 500 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర రూ. 325కి చేరింది. బెంగళూరులో నందిని ఒక లీటరు నెయ్యి ధర రూ. 135 పెరిగి రూ. 850కి చేరగా, సాల్టెడ్ బటర్ రూ. 380కి చేరింది. తమిళనాడులో ఆవిన్ సంస్థ కూడా చిన్న నెయ్యి ప్యాకెట్ల ధరలను సైతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
డిటర్జెంట్లు, సిగరెట్ల వాత:
ఇళ్లల్లో వాడే బట్టల సోపులు, డిటర్జెంట్ల ధరలు కూడా పెరిగాయ్. హిందుస్థాన్ యునిలివర్ సంస్థ సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ వంటి పాపులర్ బ్రాండ్లపై రూపాయి నుంచి పది రూపాయల వరకు ధరలను పెంచింది. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ కేజీ ధర రూ. 245కి చేరింది. మరోవైపు ఐటీసీ సంస్థ గోల్డ్ ఫ్లాక్ ప్రీమియం సిగరెట్ ప్యాక్ ధరను రూ.125 నుంచి రూ.135కి పెంచింది.
►ALSO READ | NRIని టార్గెట్ చేసి రూ.2 కోట్లు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు.. ఫారెక్స్ ట్రేడింగ్ మోసం
కమర్షియల్ ఎల్పీజీ..
సామాన్యుడికి ఉపయోగపడే డొమెస్టిక్ గ్యాస్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వ్యాపార రంగంపై ఆధారపడే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర అక్టోబర్, నవంబర్ నెలల్లో కలిసి గణనీయంగా పెరిగి రూ. 2,820కి చేరింది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లోనూ ఇదే బాటలో ధరలు ఉన్నాయి. అలాగే విమాన ఇంధన ధర లీటరుకు రూ. 1.37 పెరిగి రూ. 138.50కి చేరింది.
డ్రై ఫ్రూట్స్ రేట్ల చుక్కలు..
కేవలం పాలు, గ్యాస్ మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ ధరలు సైతం సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లాయి. పిస్తా ధరలు గత ఏడాదితో పోలిస్తే 60 నుంచి 70 శాతం వరకు పెరిగాయి. అలాగే బాదం ధరలు రకాన్ని బట్టి 20 నుండి 40 శాతం ఎక్కువయ్యాయి. సరఫరాలో అంతరాయాలు, రవాణా ఖర్చులు పెరగడం, కరెన్సీ మార్పుల కారణంగా వీటి ధరలు సామాన్యుల కొనుగోలు శక్తికి పూర్తిగా దూరమౌతున్నాయి.
