కార్తీకమాసం కొనసాగుతుంది . ఇప్పటికే ( నవంబర్ 12 నాటికి) మూడు రోజులు గడిచాయి. హిందూపురాణాల ప్రకారం అన్ని మాసాల్లో కెల్లా ఈ నెల విశిష్టమైనదని వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పండితులు చెబుతున్నారు. ఏ రోజు ఏమి చేయాలో కూడా పూర్తిగా వివరించాడు.
కార్తీకమాసం ఈ ఏడాది ( 2026) నవంబర్ 10 వ తేదీ ప్రారంభమైంది. రేపటి నుంచి ( నవంబర్ 14) నుంచి మిగతా కార్తీకం రోజులల్లో ఎలాంటి పూజలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. . .!
న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః
అంటే కార్తీకమాసం లోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది..
కార్తీక శుద్ధ పాడ్యమి రోజు తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. ఇక రెండో రోజు విదియ సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు. మూడో రోజు తదియ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.
నవంబర్ 13...(చవితి) : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
నవంబర్ 14...పంచమి : దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
నవంబర్ 15...షష్ఠి : ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
నవంబర్ 16...సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.
నవంబర్ 17...అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.
నవంబర్ 18...నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
నవంబర్ 19..దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
నవంబర్ 20...ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ఉపవాస దీక్షను పాటించాలి.
నవంబర్ 21..ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
నవంబర్ 22... త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
నవంబర్ 23..చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.
నవంబర్ 24.. కార్తీక పూర్ణిమ : కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.
నవంబర్ 25... కార్తీక బహుళ పాడ్యమి : ఆకుకూర దానం చేస్తే మంచిది.
నవంబర్ 26.. విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
నవంబర్ 27..తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
నవంబర్ 28..చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
నవంబర్ 29..పంచమి : చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
నవంబర్ 30..షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి.
డిసెంబర్ 1...సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
డిసెంబర్ 2...అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
డిసెంబర్ 3...నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
డిసెంబర్ 4...దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
డిసెంబర్ 5...ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
డిసెంబర్ 6...ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
డిసెంబర్ 7...త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
డిసెంబర్ 8...చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
డిసెంబర్ 9...అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
►ALSO READ | జ్యోతిష్యం: నాగులచవితి వేళ రాహువు కుంభరాశిలో.. కేతువు సింహరాశిలో సంచారం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం
