విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీసా నిబంధనలను మరింత సులభతరం చేస్తూ.. దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశ వీసా విధానాన్ని మారుస్తూ కేంద్ర హోంశాఖ ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల విదేశీయులు భారత్‌కు రావడం, ఇక్కడ బిజినెస్, విద్య, వైద్య సేవలు పొందడం ఇకపై అత్యంత సులభం కానుంది.
ఈ కొత్త విధానంలో భాగంగా గతంలో ఉన్న 13 ప్రధాన వీసా విభాగాలను 9కి, 49 సబ్ కేటగిరీలను 23కి తగ్గించారు. అలాగే వీసా దరఖాస్తులో నింపాల్సిన వివరాలను ఏకంగా 65 నుంచి 70 శాతం వరకు కుదించారు. దీనివల్ల ఫారమ్ నింపే సమయం ఆదా కావడంతో పాటు, అధికారుల పరిశీలన ప్రక్రియ కూడా చాలా వేగంగా సాగనుంది.
టూరిస్టుల కోసం సాధారణంగా ఇచ్చే వీసా పేరును ఇకపై 'విజిటర్ వీసా'గా మార్చారు. దీనిని V-1, V-2గా రెండు రకాలుగా విభజించారు. ఇక వైద్యం కోసం వచ్చేవారికి ప్రత్యేకంగా M-1 వీసా ఇస్తుండగా.. ఆయుర్వేద, యోగా వంటి సాంప్రదాయ 'ఆయుష్' చికిత్సల కోసం M-3 పేరిట సరికొత్త వీసాను అందుబాటులోకి తెచ్చారు. రోగుల సహాయకులకు M-2, M-4 వీసాలు కేటాయించారు. ఇవి ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటాయి.
చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థుల కోసం S-1, రీసెర్చ్ విద్యార్థుల కోసం S-2 కేటగిరీలను ప్రవేశపెట్టారు. 'స్టడీ ఇన్ ఇండియా' ద్వారా వచ్చే విద్యార్థులకు 5 ఏళ్ల వరకు వీసా లభిస్తుంది. అలాగే వ్యాపారవేత్తల కోసం B-1 (లాంగ్ టర్మ్ బిజినెస్), B-2 (స్వల్పకాలిక ఒప్పందాలు, కాన్ఫరెన్స్‌లు) వీసాలను కేటాయించారు. విదేశీ నిపుణులు, ఇంజనీర్లు B-2 ఈ-వీసా ద్వారా భారత్‌కు వేగంగా వచ్చే వెసులుబాటు కల్పించారు.
ప్రస్తుతం ఈ కొత్త వీసా విధానానికి అనుగుణంగా హోంశాఖ తన ఐటీ వ్యవస్థలను అప్డేట్ చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత పర్యాటక రంగానికి, అంతర్జాతీయ పెట్టుబడులకు భారీ ఊతం లభించడమే కాకుండా.. దేశం గ్లోబల్ టూరిజం, మెడికల్ హబ్‌గా మరింత వేగంగా ఎదుగనుంది.
