ఏపీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

ఏపీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

విశాఖపట్నం: ఏపీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 1948 ఆగస్ట్ 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు వైఎస్సార్, రోశయ్య కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.  వైఎస్ మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా, రోశయ్య కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా శత్రుచర్ల పనిచేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా గెలిచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారు. 

1978లో శత్రుచర్ల విజయరామరాజు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో చేరిన ఆయన 2017లో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 వరకూ ఎమ్మెల్సీగా కొనసాగారు. ఉత్తరాంధ్ర నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ రాజకీయ నాయకుల్లో శత్రుచర్ల విజయరామరాజు ఒకరు.

విజయ రామరాజు జనతా పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1978లో, ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత, రామరాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1983-2009 మధ్య నాగూరు, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. 

ALSO READ : మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్‌కు షాక్

1989లో రామరాజు పార్వతీపురం 9వ లోక్‌సభకు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991లో రామరాజు 10వ లోక్‌సభకు (రెండవసారి), 1998లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి 12వ లోక్‌సభకు (మూడవసారి) ఎన్నికయ్యారు.