ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి (శ్రీకాళహస్తి) ఆలయం ఆవరణలోని లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. లడ్డూలు తయారు చేసే పోటులో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆలయం అంతా పొగలు కమ్మేశాయి. 2026, నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. శ్రీ కాళహస్తి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారు చేసే కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో.. సిబ్బంది, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది అంతా బయటకు పరుగులు తీశారు.
విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితోపాటు ఆలయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి కారణం సిలిండర్ పేలుడు అంటున్నారు. లడ్డూ తయారీ కేంద్రంలో పొగలు కమ్మేయటం, ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో.. ఎవరైనా గాయపడ్డారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. లడ్డూ తయారీ కేంద్రంలో చాలా మంది సిబ్బంది పని చేస్తున్నారని.. పేలుడు తర్వాత సిబ్బంది బయటకు పరుగులు తీశారని.. ఎవరైనా గాయపడ్డారా లేదా అనేది ఇంకా తెలియలేదు అంటున్నారు అధికారులు.
శ్రీ కాళహస్తి ఆలయం ప్రాంగణంలోనే ఉంటుంది లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రం. రోజు లక్షకు పైగా లడ్డూలు తయారు చేస్తుంటారు. శివయ్యను దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ ప్రసాదం స్వీకరిస్తుంటారు భక్తులు. లడ్డూలు తయారీ కేంద్రంలో పెద్ద మొత్తంలో నెయ్యి, ఇతర సుగంధ ద్రవ్యాలు నిల్వ ఉంటాయి. వేడి వేడి నెయ్యి మరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలుడుతో భారీ శబ్ధం వచ్చింది. సిబ్బందితోపాటు సమీపంలో ఉన్న భక్తులు పరుగులు పెట్టారు. భక్తులు, స్థానికులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. సహాయక చర్యలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
