సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు అదిరిపోయే న్యూస్! థియేటర్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసి, వందల కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించిన ‘జైలర్ 2’ ఎట్టకేలకు OTTలోకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా అర్ధరాత్రి నుంచే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే చూసేందుకు రెడీ అవుతున్నారు.
‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 12 అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రావడంతో అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసే అవకాశం కలిగింది.
the sun, the moon, and the superstars are here 👑 #Jailer2OnPrime, Watch Now https://t.co/UmrPQzsGGy @rajinikanth @iHrithik @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @vidya_balan @iam_SJSuryah #MithunChakraborty @meramyakrishnan @sunpictures https://t.co/9Uz0yENkji
— prime video IN (@PrimeVideoIN) November 11, 2026
బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట..
ఇక థియేటర్లలో ‘జైలర్ 2’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా కేవలం 27 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇండియాలోనే దాదాపు రూ.470 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా.. రూ.556 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో రజినీకాంత్ కెరీర్‌లోనే మరో భారీ విజయంగా నిలిచింది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించినట్లు సమాచారం. రజినీకాంత్ స్టైల్, నెల్సన్ టేకింగ్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాలు, స్టార్ క్యాస్ట్ ప్రత్యేక పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
జైలర్ 2 స్టోరీ..
జైలర్ పార్ట్ 1లో తన కొడుకు అర్జున్‌ను చంపడంతో పాటు వర్మన్ విగ్రహాల స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కూల్చిన టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్).. పార్ట్ 2లో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. కుటుంబంతో కలిసి సాధారణ జీవితం కొనసాగిస్తుంటాడు. అయితే వర్మన్ హత్య వెనుక ఉన్న వ్యక్తి కోసం అతడి ఫ్రెండ్ దిలీప్ (సూరజ్ వెంజరమూడు) వెతుకుతుంటాడు. ఈ క్రమంలో టైగర్ గతం మళ్లీ తెరపైకి వస్తుంది.
మరోవైపు విగ్రహాల స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులైన కల్పక్ కుటుంబం రంగంలోకి దిగుతుంది. బోధి కల్పక్ (ఎస్.జే. సూర్య), కాంతా కల్పక్ (విద్యాబాలన్), వారి కుటుంబ సభ్యులు టైగర్‌ను టార్గెట్ చేస్తారు. తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని తెలుసుకున్న టైగర్ మరోసారి తన పాత అవతారాన్ని బయటకు తీస్తాడు. శత్రువుల సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా కూల్చే ఆపరేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ఊహించని మలుపులు, శత్రువులతో జరిగే పోరాటాలే 'జైలర్ 2' మెయిన్ స్టోరీ.
మొత్తానికి థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘జైలర్ 2’ ఇప్పుడు OTT ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి థియేటర్లలో మాదిరిగానే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా తలైవా తన సత్తా చాటుతారా? OTTలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
