ఆంధ్రాను కార్పొరేట్ హోంగా మార్చుకోండి : సీఐఐ సదస్సులో మంత్రి లోకేష్

ఆంధ్రాను కార్పొరేట్ హోంగా మార్చుకోండి : సీఐఐ సదస్సులో మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను కేవలం పెట్టుబడులకు గమ్యస్థానంగా కాకుండా.. పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ హోంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్. ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని.. ఆవిష్కరణలు చేపట్టి అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. కేవలం పరిశ్రమలనే కాకుండా తమ కంపెనీల ప్రధాన కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని కోరారు మంత్రి లోకేష్. 2026, నవంబర్ 12వ తేదీన విశాఖపట్నంలో జరుగుతున్న పారిశ్రామికవేత్తల భాగస్వామ్య సదస్సు.. సీఐఐ సదస్సులో ఈ మేరకు పిలుపునిచ్చారు మంత్రి లోకేష్. 

ఈ సదస్సు ద్వారా ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్‌ను ఏపీలో పెట్టుబడులు, భాగస్వామ్యాలు, అవకాశాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి లోకేష్. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, తమ బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.

ఏపీ బలం.. మౌలిక సదుపాయాలు :

ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం ఉందని, విశాఖపట్నం ప్రధాన పోర్టుతో పాటు ఇతర పోర్టులు కలిపి ఏటా సుమారు 10 కోట్ల టన్నుల కార్గోను నిర్వహిస్తున్నాయన్నారు మంత్రి లోకేష్. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణం కొనసాగుతోందని.. ఇవి పూర్తయితే కార్గో నిర్వహణ సామర్థ్యం రెట్టింపు అవుతుందని చెప్పారు. భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని.. 3 వేల 800 మీటర్ల రన్‌వేతో భారీ విమానాల రాకపోకలకు అనువుగా దీనిని నిర్మించినట్లు వివరించారాయన. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జీఎంఆర్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

దేశ పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కీలక వాటా : 

దేశంలో తయారయ్యే ఎయిర్ కండిషనర్లలో 60 శాతం శ్రీసిటీలోనే ఉత్పత్తి అవుతున్నాయని లోకేష్ వెల్లడించారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో పరిమాణం పరంగా మూడో వంతు, రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం ఏపీ నుంచే వస్తున్నాయని.. దేశీయ కోకో ఉత్పత్తిలో 40 శాతానికి పైగా, ఎండు మిర్చి ఉత్పత్తిలో 40 శాతానికిపైగా ఏపీ వాటా ఉందని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. దేశంలో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని.. జాతీయ ఉత్పత్తిలో 16 శాతం వాటా కలిగి ఉందని.. చేపలు, గుడ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని లెక్కలతో సహా వెల్లడించారు మంత్రి లోకేష్.  

అనంతపురంలోని కియా పరిశ్రమ 2019లో ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 19 లక్షల కార్లను తయారు చేసిందని, 90కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోందని వివరించారు. విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, సుమారు 25 వేల మందికి ఉపాధి కల్పించేలా శాశ్వత క్యాంపస్‌ను ప్రణాళిక రూపొందించారని తెలిపారు. టీసీఎస్ కూడా విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు.

రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడుల హామీలు : 

2024 జూన్ నుంచి రాష్ట్రానికి రూ.22.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల హామీలు వచ్చాయని మంత్రి వెల్లడించారు. వీటిలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు లభించాయని, సుమారు 73 శాతం పెట్టుబడులు ఆమోద దశకు చేరాయని తెలిపారు. రూ.5.9 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైందని, వీటి ద్వారా 7.4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని వివరించారు.

శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ.5 వేల కోట్లతో పరిశ్రమ నిర్మిస్తోందని, విశాఖలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ హబ్, గిగావాట్ స్థాయి డేటా సెంటర్ క్యాంపస్, అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వే ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

రేమండ్, ప్రీమియర్ ఎనర్జీస్, ఎస్‌ఎస్‌డీ పాలిమర్స్ విజయగాథలు : 

రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మూడు సంస్థల ఉదాహరణలతో లోకేష్ వివరించారు.

రేమండ్ : ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలోకి విస్తరించాలన్న రేమండ్ సంస్థకు భూమి, ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. సుమారు రూ.1,200 కోట్ల విలువైన ప్రాజెక్టులు రాయలసీమలోని టేకులోడు, గుడిపల్లి, రాప్తాడు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయని చెప్పారు. ఇప్పటికే తాత్కాలిక కేంద్రంలో 30కి పైగా యంత్రాలతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రీమియర్ ఎనర్జీస్ : నాయుడుపేటలో 101 ఎకరాల్లో రూ.3,293 కోట్ల పెట్టుబడితో ఏడు గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎన్-టైప్ టాప్‌కాన్ సోలార్ సెల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో ప్రీమియర్ ఎనర్జీస్ దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ తయారీదారుగా అవతరించిందన్నారు.

ఎస్‌ఎస్‌డీ పాలిమర్స్ : మచిలీపట్నానికి చెందిన ఈ ఎంఎస్ఎంఈ సంస్థ రక్షణ రంగానికి అవసరమైన ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేస్తోందని చెప్పారు. క్వాంటం టెక్నాలజీ రంగంలోనూ విడిభాగాల తయారీకి ఈ సంస్థను భాగస్వామిగా చేర్చినట్లు తెలిపారు. చిన్న పట్టణం నుంచి వచ్చిన సంస్థను భవిష్యత్తులో భారీ పరిశ్రమగా తీర్చిదిద్దడమే ఏపీ పారిశ్రామిక విధానానికి నిదర్శనమన్నారు.

స్పీడ్.. స్టెబిలిటీ.. సర్వీస్

పారిశ్రామిక అభివృద్ధిలో తమ ప్రభుత్వ విధానం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉందని లోకేష్ తెలిపారు. అవి స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అని వివరించారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు, విధానాల్లో స్థిరత్వం, ప్రైవేటు రంగానికి దీటుగా సేవలు అందించడమే లక్ష్యమన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతాల విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రోత్సాహకాలు నేరుగా పరిశ్రమలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెట్టుబడిదారులు తమ సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను నేరుగా వాట్సాప్ ద్వారా తనకు తెలియజేయవచ్చని, వెంటనే స్పందిస్తానని హామీ ఇచ్చారు.

త్వరలో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ : 

పెట్టుబడిదారులకు మరింత భరోసా కల్పించేందుకు త్వరలో రాష్ట్రంలో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురానున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇదే తరహా చట్టాన్ని కేంద్ర స్థాయిలోనూ అమలు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. 

కంపెనీల ప్రధాన కార్యాలయాలను ఏపీకి తరలించండి :

పరిశ్రమల స్థాపనతో పాటు కంపెనీల ప్రధాన కార్యాలయాలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని లోకేష్ పారిశ్రామికవేత్తలను కోరారు. రాష్ట్రంలో స్వచ్ఛమైన గాలి, అందమైన తీరప్రాంతం, మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కళాశాలలు, ఐటీఐలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

పోర్టులు, విమానాశ్రయాలు, రవాణా సదుపాయాలతో కనెక్టివిటీ మెరుగుపడుతోందని, విశాఖలో గూగుల్ ఏఐ హబ్, అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. 2027 ప్రారంభంలో క్వాంటం సిస్టమ్ టూల్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

పెట్టుబడిదారులు ప్రభుత్వ అధికారులను కలిసేందుకు నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి, మంత్రులు, తాను ఒక ఫోన్ కాల్ లేదా వాట్సాప్ సందేశం దూరంలో అందుబాటులో ఉంటామని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక దిగ్గజాలకు పిలుపునిచ్చారు.