అంతర్జాతీయ చెస్ వేదికలపై దేశం గర్వించదగ్గ రీతిలో రాణిస్తున్న 17 ఏళ్ల యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆశయాలకు భారీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ Md ఇమ్రాన్ కెరీర్ ప్రస్తుతం సంక్షోభంలో పడింది. యూరప్‌లో పడిన ఒకే ఒక్క తప్పు అడుగు ఇమ్రాన్ జీవితాన్ని తలకిందులు చేసింది. చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ఈ కుర్రాడు.. ప్రస్తుతం చెస్ బోర్డుపై కంటే నిజ జీవితంలోనే ఎన్నో అడ్డంకులతో పోరాడాల్సి వస్తోంది.
బ్రాటిస్లావాలో మొదలైన సమస్య:
గత ఏడాది జూన్‌లో స్లొవేకియాలోని బ్రాటిస్లావాలో జరిగిన టోర్నమెంట్‌లో పాల్గొన్న ఇమ్రాన్ తన పాస్‌పోర్ట్‌తో పాటు ఫోన్, డబ్బులు, ఇతర విలువైన వస్తువులను పోగొట్టుకున్నాడు. అంతకంటే పెద్ద దెబ్బ ఏమిటంటే.. ఆ పాస్‌పోర్ట్‌లోనే అతని అమెరికా ఎఫ్-1 వీసా, షెన్‌జెన్ వీసాలు ఉన్నాయి. హంగేరీ రాయబార కార్యాలయం ద్వారా అత్యవసరంగా తాత్కాలిక పాస్‌పోర్ట్ పొంది భారత్‌కు తిరిగి వచ్చినప్పటికీ.. వీసాల కష్టాలు మాత్రం వీడలేదు. ఇప్పటివరకు ఏకంగా 14 సార్లు షెన్‌జెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి రావడం అతని ప్రయాణ కష్టాలకు నిదర్శనం.
యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌నకు ముప్పు:
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ రియో గ్రాండే వ్యాలీలో చదువుకుంటూ చెస్ ఆడాలని ఇమ్రాన్ కలలు కన్నాడు. దీనికోసం అతనికి పూర్తి యూనివర్సిటీ స్కాలర్‌షిప్ కూడా లభించింది. అయితే గత 4 నెలలుగా ఎంత ప్రయత్నించినా అమెరికా వీసా అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో అతను తన ప్రవేశాన్ని 2026 ఫాల్ నుంచి 2027 స్ప్రింగ్‌కు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 19 నాటికి వీసా సంపాదించి యూనివర్సిటీలో చేరకపోతే.. స్కాలర్‌షిప్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.
కుటుంబంపై రూ. 50 లక్షల అప్పు:
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఇమ్రాన్ తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కాగా, తల్లి గృహిణి. యూరప్‌లో ప్రొఫెషనల్‌గా చెస్ ఆడటానికి ఒక్క నెలకి రూ.లక్షా 50వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది. విదేశీ టోర్నమెంట్లు, ప్రయాణాలు, వీసా ఖర్చుల కోసం ఇమ్రాన్ కుటుంబం ఇప్పటికే సుమారు రూ. 40 నుంచి రూ. 50 లక్షల వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. తండ్రి తన శక్తికి మించి సాయం చేస్తున్నప్పటికీ.. ఆర్థిక భారం అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక పథకాల కోసం అధికారులను ఆశ్రయించినా ఇప్పటివరకు స్పందన కరువైంది.
ఒకవైపు చెస్‌లో జీఎం నార్మ్‌ల సాధన కోసం నిరంతరం శ్రమిస్తూనే.. మరోవైపు వీసాలు, పెరుగుతున్న అప్పులు, చదువుపై ఆందోళనల మధ్య ఇమ్రాన్ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. తన అద్భుత ప్రతిభతో దేశానికి మరిన్ని పతకాలు తెచ్చిపెట్టాలని తపన పడుతున్న ఈ యువ చెస్ ఆటగాడికి తక్షణమే ప్రభుత్వం, దాతల సాయం అత్యవసరం. సమయానికి అమెరికా వీసా లభిస్తేనే అతని చదువు, అమెరికాలో అడుగుపెట్టాలనే కల సాకారమవుతాయని ఆందోళన చెందుతోంది యువకుడి ఫ్యామిలీ.
