- రెండు నెలల కాలపరిమితితో కొత్త సభ్యులను నామినేట్ చేసిన ట్రస్ట్
- బోర్డు సభ్యులు ఏలూరి శ్రీనివాసరావు, చావ రవి, సదానందం గౌడ్‌కు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఆధ్వర్యంలోని న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఎన్‌ఈహెచ్‌ఎస్) ప్రీ-ఆథరైజేషన్, క్లెయిమ్స్ ప్రాసెస్ సబ్ -కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), ఐఏఎస్ జిందాఘే హనుమంత్ కొండిబా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఏర్పాటైన సబ్ కమిటీ రెండ్రోజుల కిందట తమ రెండు నెలల పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడంతో వారి స్థానంలో మరో ముగ్గురు బోర్డు సభ్యులను రెండు నెలల కాలపరిమితితో ఈ కమిటీలోకి నామినేట్ చేశారు. ఎన్‌ఈహెచ్‌ఎస్ బోర్డు సభ్యులుగా ఉన్న ఏలూరి శ్రీనివాసరావు, చావ రవి, జి. సదానందం గౌడ్ ఈ సబ్- కమిటీలో కొత్త సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆగస్టు 25న జారీ చేసిన మునుపటి ఉత్తర్వుల ఆధారంగా పనిచేసిన సభ్యుల గడువు ముగియడంతో వీరిని నియమించారు.
విధివిధానాల ప్రకారమే క్లెయిమ్‌ల పరిశీలన...
న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా అమలయ్యేందుకు వీలుగా కమిటీ సభ్యులంతా విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని సీఈవో స్పష్టం చేశారు. హాస్పిటల్స్ నుంచి వచ్చే ప్రీ-ఆథరైజేషన్లు, ఉద్యోగుల మెడికల్ బిల్లుల క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ను నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుత సభ్యుల రెండు నెలల పదవీకాలం ముగిసిన తర్వాత, కాంపిటెంట్ అథారిటీ అనుమతితో తదుపరి ముగ్గురు బోర్డు సభ్యులను రొటేషన్ పద్ధతిలో సబ్-కమిటీకి ఎంపిక చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
