రాహుల్ను రీలాంచ్ చేసే కుట్ర.. అది యాంటీ భారత్ సమ్మిట్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

రాహుల్ను రీలాంచ్ చేసే కుట్ర.. అది యాంటీ భారత్ సమ్మిట్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  రాంచందర్ రావు

 

 

  •  34 నెలల్లో రూ.30 వేల కోట్ల భూములు అమ్మిండ్రు
         
  •  మియాపూర్‌‌లో అమ్మకానికి 5 వేల ఎకరాలు రెడీ
  •  భూముల అమ్మకంపై శ్వేత పత్రం విడుదల చేయాలి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ హైటెక్స్‌‌‌‌లో నిర్వహించేది ముమ్మాటికీ యాంటీ భారత్ సమిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. విదేశీ, ప్రమాదకర శక్తుల అండదండలతో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా రీలాంచ్ చేసేందుకే ఈ వేదికను వాడుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్​రావు మీడియాతో మాట్లాడారు. తొలుత ఇది తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు నిర్వహిస్తున్న సదస్సు అనుకున్నారని చెప్పారు. కానీ గత రెండు రోజులుగా సల్మాన్ ఖుర్షీద్, చికాగో నుంచి శామ్ పిట్రోడా చేసిన ట్వీట్లు చూస్తే.. ఇది విదేశీ శక్తులతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రపూరిత సమావేశమని తేలిపోయిందని పేర్కొన్నారు.  

9 దేశాల్లో విద్యార్థులను పావులుగా వాడుకుంటూ ఇస్లామిక్, కమ్యూనిస్ట్ ప్రొటెస్ట్ ఎకోసిస్టమ్‌‌‌‌ను నడుపుతున్న 101 సంస్థలు ఈ కూటమి వెనుక ఉన్నాయని ఓ సంస్థ ప్రకటించిందని గుర్తుచేశారు. ఇంతటి ప్రమాదకర వ్యవస్థలో రాహుల్ గాంధీ ప్రెసిడియం ఈక్వలెంట్ సభ్యుడిగా ఉన్నారనీ,  ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేందుకు రెజీమ్ చేంజ్  పేరిట జరిగిన హింసాత్మక అల్లర్ల వెనుక వీరి పాత్ర ఉందన్నారు.

6 గ్యారెంటీలు అమలు చేశాకే రండి

ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లను అమలు చేశాకే రాహుల్, ప్రియాంక తెలంగాణలో అడుగుపెట్టాలని రాంచందర్ రావు హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రైతులకు రైతుభరోసా ఇవ్వలేదనీ, ఎల్ నినో ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు రూపాయి పరిహారం చెల్లించలేదని ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, ప్రజల ఆస్తులైన భూములను అడ్డగోలుగా అమ్ముకుంటోందన్నారు. గత 34 నెలల్లో భూముల అమ్మకాలు, మార్ట్‌‌‌‌గేజ్‌‌‌‌ల ద్వారా సుమారు రూ.30 వేల కోట్లు సమకూర్చుకున్నారనీ, ఆ నిధులను వేటి కోసం ఖర్చు చేశారో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ మియాపూర్‌‌‌‌లోని 5 వేల ఎకరాల హెచ్ఎండీఏ, టీజీఐఐసీ విలువైన భూములను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మేందుకు, తాకట్టు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.