కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ల్యాప్ టాప్ లు ఇవ్వనుంది కేంద్రం . లక్ష 80 వేల రూపాయల విలువైన ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు అందించనున్నారు. వీటిని నాలుగేళ్లు ఆఫీస్ కార్యక్రమాలకు వినియోగించాలి. ఆ తర్వాత ల్యాప్ టాప్ లను ఉద్యోగులకే అప్పగించనున్నారు. అంటే నాలుగేళ్ల తర్వాత ల్యాప్ టాప్ లు ఉద్యోగుల సొంతం అవుతాయి.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల విభాగం 2026 నవంబర్ 10న జారీ చేసిన పరికరాల కొనుగోలు విధానంలో భాగంగా ఉద్యోగులకు ఈ అవకాశం లభిస్తుంది. యాపిల్ కంపెనీకి చెందిన మ్యాక్ బుక్ ఎయిర్ (MacBook Air ), ప్రో మోడల్స్ ఉద్యోగులకు ఇవ్వనున్నారు.
మేకిన్ ఇండియా కంటెంట్ ఉంటే ఎక్కువ ధర:
అయితే ట్యాప్ టాప్ ల కొనుగోలు సంబంధించిన నిబంధనలు వెల్లడించింది కేంద్రం. 40 శాతం కంటే ఎక్కువ మేక్-ఇన్-ఇండియా (MII) కంటెంట్ ఉన్న గాడ్జెట్స్ కు గరిష్టంగా లక్ష 80 వేల రూపాయలు ఖర్చు చేసి తీసుకోవచ్చునని పేర్కొంది. దీంతో పాటు పన్నులు కూడా జత చేస్తారు.
ఇతర పరికరాలకు పన్నులతో కలిపి లక్షా 50 వేల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చునని సూచించింది. ఈ పరిమితుల్లో స్టాండర్డ్ సాఫ్ట్‌వేర్ కూడా ఉంటుందని పేర్కొంది. మంత్రిత్వ శాఖలు, విభాగాలు అధికారులకు అధికారిక పని కోసం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, నోట్‌ప్యాడ్‌లు, అల్ట్రాబుక్‌లు, నోట్‌బుక్‌లు వంటివి ఇవ్వచ్చునని పేర్కొంది. అయితే మొబైల్ ఫోన్లు కొత్త జాబితాలో లేవు.
ఎవరికి అర్హత?
పే లెవెల్ 12, అంతకంటే ఎక్కువ ఉన్న అధికారులు పూర్తిగా అర్హులు. పే లెవెల్ 8 నుంచి 11 వరకు ఉన్నవారికి ప్రారంభంలో సాంక్షన్ పోస్టుల్లో సగం మందికి ఇస్తారు. అవసరమైతే సెక్రటరీ, ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదింపులతో 75 శాతం వరకు బడ్జెట్ పెంచవచ్చు.
నాలుగేళ్ల తర్వాత అధికారులు పరికరాలను ఉంచుకోవచ్చు. అయితే ల్యాప్ టాప్ లు తీసుకునే ముందు అధికారిక డేటా మొత్తం తొలగించాలి. ఈ నాలుగేళ్లలోపు మరో కొత్త ల్యాప్ టాప్ ఇవ్వరు. పాతది రిపేర్ చేయలేని స్థితిలో ఉంటేనే కొత్తది ఇస్తారు.
ఈ ల్యాప్ టాప్ లు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటి అనుబంధ/అధీన కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, కన్సల్టెంట్లకు వర్తించదని పేర్కొన్నారు
