- 8.44 కి.మీ మేర 5 కొత్త ఎలివేటెడ్ స్టేషన్లు
- సెక్టార్-61 వద్ద ఢిల్లీ మెట్రో బ్లూ లైన్‌తో ఇంటర్‌చేంజ్ సదుపాయం
న్యూఢిల్లీ: నోయిడా మెట్రో ‘ఆక్వా లైన్’ విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. నోయిడా సెక్టార్ 51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్ 4 వరకు 8.44 కిలోమీటర్ల మేర ఈ కొత్త కారిడార్‌ను నిర్మించనున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే నోయిడా-గ్రేటర్ నోయిడా జంట నగరాల్లో మొత్తం యాక్టివ్ మెట్రో నెట్‌వర్క్ పరిధి 71.878 కిలోమీటర్లకు చేరుకుంటుంది. తాజా విస్తరణతో గ్రేటర్ నోయిడా వెస్ట్, గౌర్ సిటీ, నోయిడా సెక్టార్ 122 ప్రాంతాల ప్రజల ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. నోయిడా సెక్టార్ 61, 70, 122, 123తో పాటు గ్రేటర్ నోయిడా సెక్టార్ 4లలో కొత్తగా ఎలివేటెడ్ స్టేషన్లు రానున్నాయి. ఈ ప్రాజెక్టులో ఢిల్లీ మెట్రో ‘బ్లూ లైన్’తో అనుసంధానం చేయడంతో పాటు నోయిడా సెక్టార్ 61 వద్ద ఇంటర్‌చేంజ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల గ్రేటర్ నోయిడా నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా బ్లూ లైన్‌లోకి మారి ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలోని ఇతర ప్రాంతాలకు రోడ్డు మార్గం అవసరంలేకుండా గమ్యంచేరుకోవచ్చు.
ప్రయాణ సమయం తగ్గుతుందా?
పీక్ అవర్స్‌లో రోడ్లపై ఉండే రద్దీ, ట్రాఫిక్ జామ్‌లను తప్పించుకోవడానికి ఈ కొత్త మార్గం ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అయితే, వాస్తవ ప్రయాణ సమయం ఎంత తగ్గుతుందనేది స్టేషన్ల స్థానాలు, రైళ్ల ఫ్రీక్వెన్సీ, షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. కొత్త కారిడార్‌కు సంబంధించి టికెట్ ధరలు, రైళ్ల వేళలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆక్వా లైన్‌లో కనిష్ట ఛార్జి రూ.10 కాగా, గరిష్ట ఛార్జి రూ.50గా ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ, నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలను వెల్లడించలేదు. నిర్మాణ షెడ్యూల్‌పై త్వరలో నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
