న్యూఢిల్లీ: అయోధ్య ఆలయ విరాళాలు, కానుకల దొంగతనం వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ఆలయానికి సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలు, విరాళాల రికార్డులను బహిర్గతం చేయాలని, కేవలం 8 మంది కింది స్థాయి ఉద్యోగుల అరెస్టుతో ఈ వ్యవహారాన్ని ముగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆలయ నిర్మాణం, ట్రస్ట్ నిర్వహణ, కానుకల సేకరణ నుంచి వాటిని బ్యాంకుల్లో జమ చేసే వరకు అన్ని దశల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ అనుబంధ వ్యక్తులే ఉన్నందున విరాళాల దొంగతనం బాధ్యత నుంచి వారు తప్పుకోలేరన్నారు. 2021లోనే ఆలయ లెక్కల బాధ్యతలు చూసిన ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రతినిధి మహిపాల్ సింగ్ దొంగతనం, అక్రమాలపై ట్రస్ట్ నిర్వాహకులు చంపత్ రాయ్, గోపాల్ రావులకు ఫిర్యాదు చేశారని, అయితే అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు చేసిన మహిపాల్ సింగ్‌నే బాధ్యతల నుంచి తొలగించారని విమర్శించారు.
ఆలయ నిర్మాణ పనుల పర్యవేక్షణ ఇంజనీర్ దీనానాథ్ వర్మ ట్రస్ట్ ఆఫీస్ పనుల్లో 40 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆడియో రికార్డింగ్‌తో సహా ఆధారాలు చూపించినా, ఆయనను కూడా ప్రాజెక్టు నుంచి తొలగించారని ఆరోపించారు. అక్రమాల గురించి ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావులను ఛార్జ్‌షీట్‌లో నిందితులుగా చేర్చకుండా కేవలం సాక్షులుగా ఎందుకు చూపారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
