లక్నో: దీపావళికి ప్రజలు పటాకులు కాల్చడాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు. పండుగ రోజుల్లో బాణాసంచా కాలుస్తూ ప్రజలు ఆనందంగా గడపడం సంతోషకరమని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. వ్యవస్థను భ్రష్టు పట్టించే అవినీతిపరులను ఎవరూ ఏమీ అనరని, కానీ ప్రజలు ఒక్క రోజు పండుగ చేసుకుంటే మాత్రం వెంటనే కాలుష్యం ముసలం పుట్టిస్తారని ఆయన మండిపడ్డారు.
పటాకుల వల్ల కాలుష్యం ఏర్పడినా.. అది కాలక్రమేణా తగ్గిపోతుందన్నారు. ప్రజల సంతోషాన్ని హరించేలా ఎలాంటి ఆంక్షలు విధించబోమని బీజేపీ ప్రభుత్వం ముందే చెప్పిందని, అందరూ స్వేచ్ఛగా పండుగ జరుపుకునేలా తాము ప్రోత్సహించామని గుర్తుచేశారు. అయోధ్యలో తాను స్వయంగా బాణాసంచా కాల్చినట్లు చెప్పారు. దీపావళికి ముందు దేశంలోని పలు నగరాల్లో వాయు నాణ్యత (ఏక్యూఐ) దారుణంగా పడిపోయింది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది.
