కార్పెంటర్కు రూ.కోటి 50 లక్షల లాటరీ : పాప పుట్టిన ఒక్క రోజు తర్వాత..!

కార్పెంటర్కు రూ.కోటి 50 లక్షల లాటరీ : పాప పుట్టిన ఒక్క రోజు తర్వాత..!

పాప పుడితే లక్ష్మీ పుట్టిందంటారు.. లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టిందని చెబుతుంటారు. అన్ని సందర్భాల్లో అది నిజమో కాదో కానీ.. ఈ దంపతుల విషయంలో అది నిజమైంది. పుట్టడంతోనే ఏకంగా కోటి 50 లక్షల రూపాయల కానుక తీసుకొచ్చింది. దీంతో నిజంగానే తమ పాలిట లక్ష్మీ దేవి అని మురిసిపోతున్నారు. ఈ పాప గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

వివరాల్లోకి వెళ్తే..  పంజాబ్‌లోని మన్సా జిల్లా బరేతా టౌన్ కు చెందిన 24 ఏళ్ల వడ్రంగి యుధ్వీర్ సింగ్‌కు జీవితంలో ఎప్పుడూ ఊహించని బహుమతి వచ్చింది.  నవంబర్ 6న కూతురు జన్మించిన మరునాడే  కోటీన్నర లాటరీ గెలుచుకున్నాడు. పంజాబ్ స్టేట్ డియర్ 200 మంత్లీ లాటరీలో ఫస్ట్ ప్రైజ్ గా ఈ లాటరీ గెలుచుకున్నాడు. 

రావడంతోనే కోట్లు తీసుకొచ్చిన తన గారాల పట్టీకి బర్కత్ అని పేరు పెట్టారు ఆ తల్లిదండ్రులు. బర్కత్ అంటే సంపద, అభివృద్ధి అని అర్థం.  ఆమె మా ఇంటికి సంపదను తీసుకొచ్చింది. ఇంకే పేరు పెట్టగలను అంటూ ఆనందంతో తబ్బుబ్బి పోయారు.

ఎలా కొన్నాడు టికెట్?

2026 నవంబర్ 4న గర్భవతి అయిన భార్య హర్మన్‌ను మన్సాలోని ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య పరీక్షలకు తీసుకెళ్లే సమయంలో  బుధ్లాడాలో ఒక లాటరీ స్టాల్ వద్ద ఆగాడు. సిమ్ కార్డు పోర్ట్ చేయించుకోవడానికి వెళ్లినప్పుడు అనుకోకుండా లాటరీ టికెట్ కొన్నాడు. ఇది ఆయన జీవితంలో మొదటిసారి లాటరీ కొనడం. భార్య మొదట అభ్యంతరం చెప్పింది. పరీక్షలకు డబ్బు కావాలి, ఆసుపత్రి బిల్లులో 5 వేలు కూడా తగ్గించలేదు.. ఇప్పుడు లాటరీ తీసుకుంటే ఖర్చులు ఎలా అని ఆమె అన్నదట. భార్య మాట కాదని కొన్నప్పటికీ.. లాటరీ తగలటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

లాటరీ ఫలితాలు నవంబర్ 7న విడుదల చేశారు. ఆ ముందు రోజే  కూతురు జన్మించి ఉంది. కొడుకు పుట్టాలంటే కూతురు పుట్టిందేంట్రా అని కుటుంబ సభ్యులు పెదవి విరిచారట.  కానీ ఇప్పుడు దగ్గర గట్టి సమాధానం ఉంది వద్దనుకున్న ఆ చిన్నారే  కోటీ 50 లక్షల  అదృష్టాన్ని తీసుకొచ్చిందని చెబుతున్నాడు. 

పేదరికాన్ని పారదోలింది.. 

యుధ్వీర్ కు 2024లో పెళ్లి అయ్యింది. ఆయన తండ్రి రోజువారీ కూలీ. కుటుంబం ఆర్థిక కష్టాలతో సతమతం అవుతూఉండేది.  రెండు గదుల ఇల్లు కట్టుకోవడానికి రుణం తీసుకున్నారు. ఇంకా ఈఎంఐలు చెల్లిస్తూనే ఉన్నారు. తన  తల్లిదండ్రులు, భార్య, శిశువుతో కలిసి బరేతాలో నివసిస్తున్నారు.

 నా కూతురు నా అదృష్టాన్ని మార్చేసింది. ఆమె తన అదృష్టాన్ని తనతో తీసుకొచ్చింది. ఈ డబ్బును ఆమె చదువు, భవిష్యత్తు కోసం ఖర్చు పెడతాను. ఆమె స్వంత కాళ్లపై నిలబడి మంచి ఉద్యోగం సంపాదించుకునేలా చూస్తాను అని యుధ్వీర్ చెప్పాడు.

బుధ్లాడా లాటరీ ఏజెంట్ దినేష్ ధన్నా  నా స్టాల్‌లో అమ్మిన టికెట్ ఒక కుటుంబం జీవితాన్ని మార్చేసింది. ముఖ్యంగా వారికి కూతురు పుట్టిన సమయంలో ఇలా జరగడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు.