తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమలలో AI స్మార్ట్ బస్ షెల్టార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. డిజిటల్ డిస్ప్లేలు, సీసీ కెమెరాలు, అత్యవసర సమాచార వ్యవస్థలతో ఈ బస్ షెల్టర్లను తీర్చిదిద్దనుంది టీటీడీ. తొలిదశలో పైలట్ ప్రాజెక్టుగా రెండు స్మార్ట్ బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది టీటీడీ.
తిరుమలలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రస్తుతం ఉచిత బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే బస్సుల కోసం వేచి ఉండే భక్తులు ఎండ, వాన, చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ బస్ షెల్టర్లను నిర్మించాలని నిర్ణయించింది టీటీడీ.
తిరుమలలో దాదాపు 46 దర్శనీయ ప్రాంతాలకు సంబంధించి రవాణా సౌకర్యాలు ఉండగా.. ప్రస్తుతం 21 బస్టాపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. ఈ క్రమంలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ స్మార్ట్ బస్ షెల్టర్లలో డిజిటల్ డిస్ప్లేలు, సీసీ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఎస్ఓఎస్ బటన్, ఆధునిక లైటింగ్, అగ్నిమాపక పరికరాలు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అంతేకాకుండా బస్సుల రాకపోకలు, ప్రయాణ మార్గాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని భక్తులు తెలుసుకునేలా డిజిటల్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా రేమాండ్స్ సంస్థ ముందుకొచ్చినట్లు సమాచారం. వారణాసిలో ఏర్పాటు చేసిన ఆధునిక బస్ షెల్టర్లను పరిశీలించిన అనంతరం తిరుమలలోనూ అలాంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. తొలిదశలో రెండు సంస్థల సహకారంతో పైలట్ ప్రాజెక్టు కింద రెండు స్మార్ట్ బస్ షెల్టర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండగా... ఒక్కో స్మార్ట్ బస్ షెల్టర్ నిర్మాణానికి సుమారు 22 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
ప్రస్తుతం ఉన్న 21 బస్టాపులకు అదనంగా మరో నాలుగు ప్రాంతాల్లో బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని టీటీడీ యోచిస్తోంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చే వృద్ధులు, మహిళలు, చిన్నారులు, ఇతర భక్తులకు ఈ స్మార్ట్ బస్ షెల్టర్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపింది టీటీడీ.
