దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇకపై తమ అధికారిక సిబ్బంది కార్ల కొనుగోళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపాలని స్పష్టం చేసింది. వాహనాల కొనుగోలుకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఉన్న ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజిన్(ICE) కార్లను తొలగించే స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసేటప్పుడు ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలే మొదటి ప్రాధాన్యతగా ఉంటాయని పేర్కొన్నారు. ఒకవేళ ఏ శాఖయినా ఈవీల కొనుగోలు ఆచరణాత్మకం కాదని భావించి సాధారణ పెట్రోల్, హైబ్రిడ్ వాహనాలను కొనాలంటే అందుకు తగిన కారణాలను చూపుతూ ఆర్థిక శాఖ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఈవీల కొనుగోలును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ధరల పరిమితిని కూడా సవరించింది. కేంద్ర ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాల నెట్ డీలర్ ధరల పరిమితిని ఏకంగా రూ. 20 లక్షలకు పెంచాయి. అదే సమయంలో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వంటి సాంప్రదాయ వాహనాల ధరల పరిమితిని మాత్రం రూ. 10 లక్షలుగానే నిర్ణయించారు.
కేవలం సొంత వాహనాల కొనుగోలు మాత్రమే కాకుండా, ప్రభుత్వ అవసరాల కోసం కార్లను అద్దెకు తీసుకునే విషయంలోనూ ఈవీలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి. గతంలో 2022 సెప్టెంబర్ 1న జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని శాఖలు కచ్చితంగా పాటించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అద్దెకు కూడా ఈవీలు కాకుండా సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలు తీసుకోవాల్సి వస్తే.. ప్రత్యేక అనుమతులు తీసుకోవడం తప్పనిసరి చేశారు.
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచనుంది. ప్రభుత్వ రంగంలోనే ఈవీల వాడకం విపరీతంగా పెరిగితే.. అది ఆటోమొబైల్ మార్కెట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ కార్లన్నీ త్వరలోనే ఎలక్ట్రిక్ మయంగా మారేందుకు ఈ తాజా ఉత్తర్వులు పటిష్టమైన బాటలు వేశాయి.
