విశాఖపట్నంలో 31వ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమయ్యింది. గురువారం ( నవంబర్ 11 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా నిర్మిస్తున్నామని..పర్సిశ్రామిక వేత్తలందరూ అమరావతిని రెండో నివాసంగా మార్చుకోవాలని అన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఐకానిక్ భవనాలతో ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు.
ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి కియా కార్ల తయారీ యూనిట్ ఓ మంచి ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతోపాటు అవసరమైన భూమిని కేటాయిస్తున్నామని అన్నారు. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి భూమి కేటాయించామని.. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ కూడా కేవలం 19 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. పరిశ్రమల స్థాపనలో అనుమతుల మంజూరుకు సంబంధించి ఏపీ అనుసరిస్తున్న వేగానికి ఇవి నిదర్శనమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
లాజిస్టిక్స్ కు ఏపీ అనుకూలం
ఏపీలో ప్రస్తుతం ఆరు ఆపరేషనల్ పోర్టులు, విమానాశ్రయాలు, హైస్పీడ్ రైలు నెట్వర్క్, మెరుగైన రోడ్డు కనెక్టివిటీ అందుబాటులో ఉన్నాయని.. ఇవన్నీ ఏపీని అత్యుత్తమ లాజిస్టిక్స్ హబ్‌గా నిలబెడతాయని అన్నారు చంద్రబాబు.
గోదావరి–కావేరీ అనుసంధానంతో జల భద్రత
నదుల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటితోపాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని... గోదావరి కుడి, ఎడమ కాలువల ద్వారా విశాఖపట్నం, అమరావతికి నీటిని అందించడంతోపాటు కావేరీ నదీ పరీవాహక ప్రాంతానికి కూడా నీటిని తరలించే అవకాశాలున్నాయని అన్నారు.
గోదావరి–కావేరీ అనుసంధానం ద్వారా ఐదు రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చే అవకాశం ఉందని... దేశంలో విద్యుత్ గ్రిడ్ తరహాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు చంద్రబాబు.
25 సెక్టోరల్ పార్కులు:
రాష్ట్రంలో 25 సెక్టోరల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని... తిరుపతిని ప్రపంచస్థాయి సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు చంద్రబాబు. పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, జల వనరులు, సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఏపీని దేశంలోనే కీలక పారిశ్రామిక, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు చంద్రబాబు.
