ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా సరే.. ఈపాటికి కోకాపేటలో ఫ్లాట్ కొనేవాడిని: బుచ్చిబాబు కామెంట్స్ వైరల్

ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా సరే.. ఈపాటికి కోకాపేటలో ఫ్లాట్ కొనేవాడిని: బుచ్చిబాబు కామెంట్స్ వైరల్

ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే ప్రమోషన్లతో పాటు సరదా సంభాషణలు కూడా ఉండాల్సిందే! తాజాగా ‘డీఎన్‌కే’ ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు తనదైన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించారు. నిర్మాత రవిశంకర్‌ను ఉద్దేశించి ‘‘మీరు పిలిచిన ప్రతి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నాను. ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా కోకాపేటలో ఫ్లాట్ కొనేవాడిని’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఈ వేడుకలో బుచ్చిబాబు ఇంకా ఏమన్నారు? మౌళి తనూజ్ ప్రశాంత్ నటించిన ‘డీఎన్‌కే’పై ఎలాంటి అంచనాలున్నాయి? అనే వాటిపై ఓ లుక్కేద్దాం..

మౌళి ‘డీఎన్‌కే’పై పెరుగుతున్న అంచనాలు..

యంగ్ హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డీఎన్‌కే (DonGaNaakOduKu)’ విడుదలకు సిద్ధమైంది. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రేపు (నవంబర్ 13న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండగా.. తాజాగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు తన కామెడీ టైమింగ్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఈ వేడుకకు హాజరైన బుచ్చిబాబు.. నిర్మాత రవిశంకర్‌ను ఉద్దేశించి చేసిన సరదా కామెంట్స్ హైలైట్‌గా మారాయి. ‘‘మీరు పిలిచిన ప్రతి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నాను. ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా సరే.. ఈపాటికి కోకాపేటలో ఫ్లాట్ కొనేవాడిని. ఫ్రీగానే వస్తున్నాం.. నెక్స్ట్ టైమ్ నుంచైనా పేమెంట్ ఇప్పించండి. అయితే, మీరు పిలిచినప్పుడు రాకపోతే కొడతారో, తిడతారో అని ప్రతిసారీ ఈవెంట్‌కు రావాల్సి వస్తోంది’’ అంటూ నవ్వులు పూయించారు. దీంతో ఆడిటోరియం మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది.

మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘డీఎన్‌కే’పై ఆసక్తి నెలకొంది. మౌళి తనూజ్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తుండటం, లిటిల్ హార్ట్స్ ఫేమ్ జయకృష్ణ కూడా తోడవ్వడం సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేసింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘డీఎన్‌కే’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే!