ఉత్తర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడిచింది. 2027 ఎన్నికల కోసం చంద్రశేఖర్ ఆజాద్, ఒవైసీ జట్టుకట్టారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎంఐ) , నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కలిసి పోటీ చేయనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను 2026 నవంబర్ 12 ( గురువారం ) లక్నోలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు.
దళితులు, మైనారిటీ ఓట్లను ఏకం చేసే లక్ష్యంతో ఈ కూటమి ఏర్పడింది. ఒవైసీ పార్టీ ఇండియా కూటమితో చేరాలని ప్రయత్నించినా కుదరలేదు. ఈ విషయంలో అక్టోబర్ 2 లోపు సమాధానం ఇవ్వాలని గడువు విధించినా సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అంగీకరించలేదు. దీంతో ఆజాద్ పార్టీతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఉత్తరప్రదేశ్లో ఎంఐఎంఐకి ఓటు బ్యాంక్ పెద్దగా లేనప్పటికీ.. మైనారిటీ వర్గాల్లో ఓవైసీ ప్రభావం చూపనున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ యువ దళిత ఓటర్ల మధ్య తన పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీ మూడవసారి అధికారం కోసం సిద్ధమవుతుండగా, ప్రతిపక్షాలు సై అంటే సై అంటుండగా.. ఈ కొత్త కూటమి ఏర్పడటం రాజకీయంగా చర్చనీయాంశం.
బీజేపీ దండయాత్రను అడ్డుకోవడమే లక్ష్యం:
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిని అడ్డుకోవడమే లక్ష్యంగా కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ఆజాద్ తెలిపారు. బీజేపీని మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు కూటమి అడ్డుకుంటుందన్నారు. తమ కూటమి మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఒవైసీ తెలిపారు.
